Wednesday, January 22, 2025

ఐటిఐఆర్ రద్దు చేసింది మోడీ సర్కారే: జగ్గారెడ్డి

- Advertisement -
- Advertisement -

గతంలో ఐటీఐఆర్‌ను కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపిఏ ప్రభుత్వం మంజూరు చేసిందని, ఆ తర్వాత వచ్చిన మోడీ సర్కార్ రద్దు చేసిందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. రద్దు చేసిన ఐటీఐఆర్‌ని తెప్పించాల్సిన బాధ్యత కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లదేనని స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఐటీఐఆర్ కోసం ఆ నాడు యూపీఏ ప్రభుత్వం అన్ని పర్మిషన్లు ఇచ్చిందని తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీఐఆర్ వస్తే ఈ పదేండ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వచ్చేవని అన్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి యువతను ఆకర్షించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ నుండి కేంద్ర మంత్రులుగా ఉన్న బీజేపీ నేతలు ఏనాడు ఐటీఐఆర్ పై చర్చ చేయలేదని విమర్శించారు.

ఎప్పుడు చూసినా గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారు తప్ప చేసేది ఏమీలేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సేఫ్ జోన్ ప్రాంతం అని అప్పుడు సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ ఐటీఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ పదేళ్ల సమయాన్ని కిషన్ రెడ్డి, దత్తాత్రేయలు వృధా చేశారని అన్నారు. తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిలో 50 లక్షల మందికి వెసులు బాటు కలిగేదని అన్నారు. కుల వృత్తుల వాళ్ళకి కూడా ఉపాధి దొరికేదని తెలిపారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని తమ యూపిఏ ప్రభుత్వం ఐటిఐఆర్‌ను మంజూరు చేసిందని, కానీ ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీయే సర్కార్ ఐటీఐఆర్ రద్దు చేస్తే చర్చ లేకుండా పోయిందని అన్నారు. జెండాలు పట్టుకుని జై శ్రీరామ్ అంటారు కానీ బతకడానికి అక్కరకు వచ్చే ఐటిఐఆర్ గురించి మాత్రం పట్టించుకోలేదని తెలిపారు. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లు తక్షణమే ఐటీఐఆర్‌ను మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.

బండి సంజయ్ హైదరాబాద్ గడ్డ మీద అడుగుపెట్టగానే ఐటీఐఆర్ తెస్తానని అని ఉంటే బాగుండేదని, భాగ్యలక్ష్మి అమ్మవారిని బంగారు దేవాలయం చేస్తా అన్నారని అన్నారు. ఆకలితో ఉన్న వాళ్లకు అన్నం పెట్టాలి తప్ప సెంటిమెంట్ తో రెచ్చగొట్టడం మానుకోవాలని తెలిపారు. ఐటిఐఆర్ తెచ్చే వరకు కేంద్ర మంత్రులకు గుర్తు చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీల నుంచి చేరికల అంశం ముఖ్యమంత్రి పరిధిలోనిదని చెబుతూ తన పరిధికి మించి స్పందించనని, రాహుల్ గాంధీకి ఇచ్చిన మాట తప్పనని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News