ఫ్రాన్స్ లోని మార్సెయిల్‌లో భారత నూతన కాన్సులేట్ ను ప్రధాని నరేంద్రమోడీ , ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. అంతకు ముందు మేక్రాన్‌తో కలిసి భారత అమరవీరులకు మోడీ నివాళులు అర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా గతంలో ఆ దేశ ప్రభుత్వం మార్సెయిల్ ప్రాంతంలో యుద్ధ స్మారకం నిర్మించింది. కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమీషన్ చే దీని నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగినట్టు పీఎంఓ వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలు , అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపినట్టు పేర్కొంది.
సాంకేతికత, రక్షణ , పౌర అణుఇంధనం , అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ మంగళవారం పారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి సహ అధ్యక్షుడిగా వ్యవహరించారు. పలుదేశాల అధినేతలు టెక్ రంగ నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. నేటితో ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని అమెరికాకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌తో భేటీ అవుతారు. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి భేటీ కానున్న ప్రధాని మోడీ పలు అంశాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది.