బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం బెంగళూరులో సరికొత్త మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించారు. తరువాత మైట్రో రైలులో కొంత దూరం ప్రయాణించారు. సిబ్బంది, వర్కర్లతో కలిసి ప్రయాణించి వారితో ముచ్చటించారు. 13.71 కిలోమీటర్ల పొడవైన వైట్ ఫీల్డ్ మెట్రోరైలు మార్గం 12 స్టేషన్లతో, రూ 4,249 కోట్ల వ్యయంతో నిర్మితంఅయింది. కడుగోడి నుంచి కృష్ణరాజపురం వరకూ ఈ రైలు మార్గం విస్తరించుకుని ఉంది. మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దశలోనే ఇప్పుడు బెంగళూరు వాసులకు ఈ మెట్రో కొత్త మార్గం అందుబాటులోకి వచ్చింది. కడుగొడి మెట్రోస్టేషన్‌కు రాగానే ప్రధాని మోడీ టికెటు కౌంటర్ నుంచి తొలి టికెటు కొనుక్కున్నారు.
సామాన్య ప్రయాణికుడి మాదిరిగానే తానూ టికెట్ కొనుక్కుని ఎస్కలేటర్ల గుండా స్టేషన్ ప్లాట్‌ఫారం లోపలికి వెళ్లారు.మధ్యలో అక్కడ ఏర్పాటు చేసిన మెట్రో రైలు మార్గాల ప్రస్థానాన్ని తెలిపే ఎగ్జిబిషన్‌ను తిలకించారు. రైలు మార్గం ప్రారంభోత్సవం సూచకంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తరువాత రైలులోకి చేరుకున్నారు. ఆయన వెంట రాష్ట్ర గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి బస్వరాజు బొమ్మై , ఇతర ప్రముఖులు ఉన్నారు. ఇప్పటి మెట్రో కొత్త రైలు మార్గంతో బెంగళూరులో అయిదు నుంచి ఆరు లక్షల మంది ప్రయాణికులకు మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రత్యేకించి బెంగళూరులో పనిచేసే హైటెక్ కంపెనీల ఉద్యోగులకు ఈ రైలు మార్గం బాగా ఉపయోగపడుతుంది.