హైదరాబాద్: చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. కనెక్టివిటీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని మోడీ అన్నారు. మెట్రో నెట్ వర్క్ 1000 కిలోమిటర్లకు పైగా విస్తరించిందని మోడీ చెప్పారు. జమ్ము కశ్మీర్, ఒడిశా, తెలంగాణలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయన్నారు. ఒక్కో అడుగు వేసుకుంటూ దేశంలో కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, రైల్వే ఆదునికీకరణకు ప్రధాన్యం ఇస్తున్నామని తెలిపారు. రైల్వే రంగంలో మౌళిక సదుపాయాలకు ప్రధాన్యం ఇస్తున్నామని ప్రధాని చెప్పారు.
దేశంలో హైస్పీడ్ రైళ్ల కోసం డిమాండ్ పెరుగుతోందని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నామని తెలిపారు. దేశంలో 35 శాతం విద్యుదీకరణ పూర్తి చేశామని.. ఇప్పటికే వందే భారత్, నమో భారత్, అమృత్ భారత్ రైళ్లు తీసుకొచ్చామన్నారు. గత దశాబ్దకాలంలో రైల్వే కొత్త రూపం సంతరించుకుందని చెప్పారు. రైల్వేల ఆదునికీకరణ దేశం ముఖచిత్రాన్నే మారుస్తోందని మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు సోమన్న, కిషన్ రెడ్డి, బండి సంజయ్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొన్నారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభినందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ టెర్మినల్ ను రూ.413 కోట్లతో అత్యాధునిక హంగులతో ఆధునికీకరించారు.