Monday, December 23, 2024

ఇటలీ నుంచి మార్బుల్.. 300కి పైగా హైటెక్ సెన్సార్లు!

- Advertisement -
- Advertisement -

రూ. 700 కోట్లతో అబుదాబిలో మొట్టమొదటి హిందూ ఆలయ నిర్మాణం

అబు దాబి: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా బుధవారం ప్రారంభమైన అబుదాబిలోని మొట్టమొదటి హిందూ శిలాలయం ప్రాచీన వాస్తు కళా రీతులతోపాటు ఆధునిక శాస్త్రీయ సాంకేతికత సమ్మిళితంగా నిర్మాణం చెందింది. బోచసన్వాసి అక్షర్ పురుషోత్తం(బిఎపిఎస్) స్వామినారాయణ్ సంస్థ అల్ రహబా సమీపంలోని అబు మెరిఖాలో 27 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించింది. వాతావరణ ఉష్ణోగ్రతను అధ్యయనం చేయడంతోపాటు భూమి లోపల కదలికలను అంచనా వేయగల 300కు పైగా హైటెక్ సెన్సార్లను ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించారు. ఆలయ నిర్మాణంలో ఏ రకమైన లోహాన్ని వినియోగించలేదు.

ఫౌండేషన్‌ను నింపడానికి శిలాజ బూడిదను(ఫ్లైయాష్)ను మాత్రమే ఉపయోగించారు. దుబాయ్-అబు దాబి షేక్ జాయేద్ హైవే సమీపాన రూ. 700 కోట్లతో ఈ శిలాలయం నిర్మాణమైంది. శిల్ప, స్థపతీయ శాస్త్రాలు, ప్రాచీన హిందూ గ్రంథాలలో నిర్దేశించిన ప్రమాణాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా ఆలయ ఆకృతిని, నిర్మాణ విధానాన్ని ప్రాచీన శైలిలో నిర్మించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వాస్తు శాస్త్ర నియమ నిబంధనలను ఆధునిక విజ్ఞానాన్ని మేళవించి ఆలయ నిర్మాణం చేపట్టినట్లు వారు చెప్పారు. ఉష్ణోగ్రతను, పీడనాన్ని, భూమిలోపల కదలికలను గుర్తించగలిగే 300కి పైగా సెన్సార్లను ఆలయానికి చెందిన వివిధ స్థాయిలలో ఉపయోగించినట్లు వారు వివరించారు. ఆ ప్రాంతంలో ఎక్కడైనా భూకంపం సంభవించిన పక్షంలో వెంటనే ఈ సెన్సార్లు గుర్తిస్తాయని, దీని వల్ల అధ్యనాన్ని చేయడానికి వీలుపడుతుందని బిఎపిఎస్ అంతర్జాతీయ సంబంధాల అధిపతి స్వామి బ్రహ్మ విహారిదాస్ తెలిపారు.

ఫౌండేషన్‌ను నింపడానికి కాంక్రీట్ మిక్స్‌లో 55 శాతం సిమెంట్‌కు బదులుగా ఫ్లైయాష్‌ను ఉపయోగించామని ఆయన చెప్పారు. యుఎఇలో ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండడం వల్ల వేడి గాలులను తట్టుకునే విధంగా నానో టైల్స్‌ను, హెవీ గ్లాస్ ప్యానెల్స్‌ను వాడామని ఆలయ నిర్మాణ మేనేజర్ మధుసూదన్ పటేల్ తెలిపారు. వేడి వాతావరణంలో సైతం సందర్శకులు ఎటువంటి అసౌకర్యం చెందకుండా నడిచేందుకు వీలుగా టైల్స్ వేయడం జరిగిందని ఆయన చెప్పారు. 8 లక్షల ఇటుకలు, 7 లక్షల పని గంటలు, రాజస్థాన్ నుంచి నేరుగా తెప్పించిన 1.8 లక్షల ఘనపు మీటర్ల శాండ్‌స్టోన్‌తో ఆలయ నిర్మాణం జరిగిందని ఆయన తెలిపారు.

అయోధ్యలో ఇటీవల ప్రాణ ప్రతిష్ట చేసుకున్న రామాలయం తరహాలోనే అబు దాబిలోని మొట్టమొదటి హిందూ శిలాలయం నాగర శైలిలో నిర్మాణమైందని ఆయన చెప్పారు. రాజస్థాన్‌లో చెక్కించిన 20,000 టన్నుల శాండ్‌స్టోన్ పలకలు 700 కంటెయినర్లలో అబు దాబికి సముద్ర మార్గంలో వచ్చాయని ఆయన వివరించారు. గుజరాత్, రాజస్థాన్‌కు చెందిన వందలాది మంది కార్మికులు ఐదేళ్లకు పైగా ఆలయ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. ఇటలీలో వెలికితీసిన పాలరాతి పలకలు మొదట భారత్‌కు వెళ్లి అక్కడ రూపుదిద్దుకున్న తర్వాత యుఎఇకి వచ్చాయని ఆయన చెప్పారు. యుఎఇ ప్రభుత్వం విరాళంగా అందచేసిన స్థలంలో 2019లో ఆలయం నిర్మాణం ప్రారంభమైంది ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News