Wednesday, January 22, 2025

భవనం కాదు.. భారత భవిత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: నూతన పార్లమెంటు భవనం 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు, కలలకు ప్రతిబింబమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. నూతనంగా నిర్మించిన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. నూతన పార్లమెంటు భవనాన్ని శాస్త్రయుక్తంగా ప్రారంభించిన ప్రధాని మోడీ జాతికి అంకితం చేశారు. ఈ వేడుకలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, ఎంపీలు, ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, లోక్‌సభ స్పీకర్‌తో పాటుగా ప్రధాని మోడీ తొలి ప్రసంగం చేశారు.‘ దేశ వికాసయాత్రలో ఎప్పటికీ నిలిచిపోయే కొన్ని ఘడియలు వస్తాయి.

అలాంటి వాటిలో ఈ రోజు ఈ రోజు. అమృతోత్సవ వేళ చరిత్రాత్మక ఘటనలో ప్రజలు భాగస్వాములయ్యారు. ఇది కేవలం భవనం కాదు. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షల, కలల ప్రతిబింబం. ప్రపంచానికి భారత్ దృఢ సంకల్ప సందేశాన్ని ఈ భవనం ఇస్తుంది. స్వాతంత్య్ర సమర యోధుల కలల సాకార మాధ్యమంగా, ఆత్మనిర్భర భారత్‌కు సాక్షిగా ఈ భవనం నిలుస్తుంది. నవ భారతం కొత్త మార్గాలను నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్తోంది. కొత్త ఆలోచనలు, సంకల్పంతో భారత్ ప్రగతి పథాన ముందుకు సాగుతోంది.ప్రపంచం మొత్తం మన దేశ అభివృద్ధి, సంకల్పాన్ని ఆసక్తిగా గమనిస్తోంది’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ‘ ఈ పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం. ఇది అనేక సంస్కృతుల సమ్మేళనం.

చరిత్రాత్మక సమయంలో సెంగోల్ ప్రతిష్ఠాపన జరిగింది. కర్తవ్యం, సేవకు ప్రతీకగా ఇది నిలుస్తుంది. సభా కార్యక్రమాల వేళ ప్రేరణగా ఉటుంది. ప్రజాస్వామ్యం పురుడు పోసుకున్న నేల ఇది. ఇక్కడ జరిగే నిర్ణయాలు దేశ ఉజ్వల భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వంచిత, పీడిత వర్గాలకు పార్లమెంటు ద్వారా న్యాయం జరగాలి.ఇక్కడ చేసే చట్టాలతో భారత్ మరింత పురోభివృద్ధి సాధిస్తుంది. ఈ పార్లమెంటు భవనంలోని ప్రతి ఇటుక, గోడ ప్రజల సంక్షేమానికి అంకితం కావాలి. భారత్ మళ్లీ పూర్వ వైభవాన్ని సాధిస్తుంది’ అని మోడీ పేర్కొన్నారు.

‘స్వతంత్ర’ వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు సావర్కర్ జయంతి మే 28 అని తెలిపారు. ఆయన చేసిన త్యాగం, ప్రదర్శించిన ధైర్య సాహసాలు,దృఢసంకల్పం నేటికీ ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఆయన వ్యక్తిత్వం ఎంతో బలాన్నిస్తుందన్నారు. ఆయన నిర్భయత్వం, ఆత్మాభిమానం బానిస మనస్తత్వాన్ని సహించవన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News