భారతీయ విలువలతో సవ్య పరిష్కారం
9/11 ఘటన హేయమైన అమానుషం
సర్దార్‌ధామ్ భవన్ సభలో ప్రధాని మోడీ
అహ్మదాబాద్ : 20 ఏళ్ల నాటి 9/11 ఘటన మానవతపై జరిగిన పెనుదాడి అని, ప్రామాణిక విలువల ఆచరణతోనే ఇటువంటి వాటికి శాశ్వత పరిష్కారం కనుగొనవచ్చునని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్లుటిఒ) ప్రధాన కేంద్రంపై ఉగ్రవాద దాడికి సెప్టెంబర్ 11తో 20 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ఇటువంటి ఉగ్రవాద ధోరణులతో తలెత్తే విషాద ఘట్టాలపై ఆవేదన ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికంగా వెలిసిన సర్దార్‌ధామ్ భవన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ప్రక్రియ ద్వారా ప్రారంభించిన తరువాత ప్రధాని మాట్లాడారు. ప్రపంచానికి అత్యవసరంగానే కాదు సర్వదా మానవీయ విలువలు అత్యవసరం. వీటిని పాటించడం, గతి తప్పకుండా పరిరక్షించడం జరిగితేనే ఉగ్రవాదపు విషాద ఘట్టాలు చోటుచేసుకోకుండా ఉంటాయి. చరిత్ర పుటలపై అవాంఛనీయపు నెత్తుటి మరకలు పడకుండా ఉంటాయని ప్రధాని తెలిపారు.
ఈ రోజు సెప్టెంబర్ 11, 2021. ఇదే రోజు 2001లో ప్రఖ్యాత ట్విన్ టవర్స్‌పై ఉగ్రదాడి జరిగింది. ఇక ఇదేరోజు 1893లో చికాగోలో జరిగిన ప్రపంచ స్థాయి మత సదస్సులో మానవీయ విలువల గురించి ప్రబోధించారు. ప్రజానీకంలో సోదరసోదరీ భావనతోనే అమానుషానికి అడ్డుకట్ట వేయవచ్చునని తెలిపారని ప్రధాని గుర్తు చేశారు. ఈ విధంగా భారతీయ విలువలతోనే ఉగ్రవాద దాడులకు అడ్డుకట్ట వేసేందుకు మార్గం ఏర్పడుతుందని ప్రధాని తెలిపారు. ‘ కాల చరిత్రలో ఇదే రోజు రెండు వేర్వేరు ఘట్టాలు జరిగాయి. ఒకటి వేలాది మందిని దెబ్బతీసిన అమానుషపు ఘటన. శతాబ్దం కింద ఇదే రోజు జనకోటిని మానవీయ విలువలతో కలిపే సందేశం చోటుచేసుకుంది’ అని ప్రధాని తెలిపారు. ఉగ్రవాద దారుణాలు తిరిగి తలెత్తకుండా ప్రపంచం అంతా శాశ్వత పరిష్కారానికి ఆశతో ఎదురుచూస్తోంది. 9/11 ఘటనల నివారణకు మానవతతో కూడిన స్పందన అవసరం అని ప్రపంచం గుర్తించిందని తెలిపారు. ఈ విధంగా భారతీయ మహనీయ వ్యక్తులు ప్రబోధించిన విలువలతోనే సవ్యమైన పరిష్కారానికి దారి ఏర్పడుతుందనే ఆశాకిరణం ఏర్పడిందన్నారు.
ఉగ్రదాడుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలనుకుంటే , ఇందుకు అనుగుణంగా మనను మనను తీర్చిదిద్దాలనుకుంటే మనకున్న పరిష్కార మార్గం ఒక్కటే అది మానవతను మరింత పరిపూర్ణ రీతిలో అలవర్చుకోవడం అన్నారు. మనిషి తన మౌలిక లక్షణాలకు అనుగుణంగా స్పందించడం జరిగితే ఇటువంటి ఉగ్ర వికృత చర్యలకు దారులు వాటంతట అవే మూసుకుపోతాయని చెప్పారు. శాశ్వత పరిష్కారానికి ఇటువంటి ప్రక్రియను ఎంచుకోవడమే కీలకమన్నారు. ప్రధాని ఆరంభించిన సర్దార్‌ధామ్‌లో విద్యార్థులు, ఉద్యోగార్థులు ఉండేందుకు బస, ఇతర సౌకర్యాలు ఉంటాయి. ఈ భవనంతో పాటు ప్రధాని మోడీ బాలికల వసతి గృహం కన్యా ఛత్రాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇదే రోజు బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో తమిళ కవి సుబ్రమణ్య భారతి పేరిట తమిళ భాష అధ్యయనానికి ప్రత్యేక పీఠాన్ని ఆరంభించారు. భారత దేశపు పండిత శ్రేష్టుడు భారతి వేదాంతి, స్వాతంత్య్ర సమరయోధులని , ఈ రోజు ఆ మహనీయుడి శత వర్థంతి అని ప్రధాని గుర్తు చేశారు.