Monday, November 18, 2024

ఉజ్వల భవితకు వారసత్వ పరిరక్షణ

- Advertisement -
- Advertisement -
సోమనాథ్‌తో ఆరంభమైన సాంస్కృతిక పునర్నిర్మాణం,  బానిసత్వ భావజాలం నుంచి విముక్తి పొందాం
స్వరవేద్ మహామందిర్ ఆరంభంలో ప్రధాని మోడీ,  ఏడంతస్తుల అతి పెద్ద ధ్యాన మందిర కేంద్రం

వారణాసి : దేశం దాస్య మనస్తతత్వం నుంచి విముక్తి పొందిందని, తన తరాల ఉజ్వల వారసత్వం పట్ల గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. సోమవారం ఆయన తమ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరాన్ని ఆరంభించారు. ‘స్వరవేద్ మహామందిర్’గా నిలిచిన ఈ ధ్యాన కేంద్రాన్ని జాతి జనులకు అంకితం చేస్తున్నట్లు తొలుత ప్రధాని ప్రకటించారు. మందిర ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆయన పరాయి పాలకుల గురించి ఘాటైన విమర్శలకు దిగారు.

“బానిసత్వ దశలో పాలకులు అణచివేతకు దిగారు. భారతదేశ వైభవాన్ని దెబ్బతీసేందుకు యత్నించారు. ముందుగా మన సంస్కృతి చిహ్నాలను తమ దాడికి నిర్ణీతంగా ఎంచుకున్నారు. ధ్వంసం చేశారు. ఎప్పుడైతే మనకు స్వాతంత్య్రం సిద్ధించిందో అప్పుడు మనకు ఇటువంటి మన సాంస్కృతిక ప్రతీకల పునర్నిర్మాణం అత్యవసరం అయింది. ఈ దిశలో పరుగులో ఇది మైలురాయి’ అని ప్రధాని తెలిపారు. అయితే ఈ ప్రక్రియకు కూడా వ్యతిరేకత వ్యక్తం అయిందని, సోమనాథ్ దేవాలయ పునర్నిర్మాణంలో కొంత ప్రతికూలత వెలువడిందని గుర్తు చేశారు. ఈ వ్యతిరేక భావజాల ప్రభావం దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిందన్నారు. ఈ పరిణామంతో మనం పూర్తి స్థాయిలో ఆత్మనూన్యత వైఖరిలోకి కూరుకుపోయామని, ఇదో అగాధం అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడు దశాబ్దాలకు కాలచక్ర పరిభ్రమణం
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడు దశాబ్దాలకు నిలిచిపోయిన కాల చక్రం కదలిక ఏర్పడింది. ఎర్రకోట సాక్షిగా మనం బానిసత్వ మనస్తత్వం నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్నాం. ఇప్పుడు తెరమరుగు అయిన మన పూర్వపు వైభవాల ప్రతీకల నిర్మాణ పనులలో ఉన్నామని ప్రధాని తెలిపారు. సోమనాథ్ నుంచి ఈ ప్రక్రియ ఆరంభం అయిందని, ఇది ఇప్పుడు ఉద్యమ స్థాయిలో ముందుకు పోతోందని వివరించారు. ఇక్కడి విశ్వనాధుని ఘనత భారతదేశానికి ఉన్న అవిధ్వంసకర వైభవాన్ని శక్తిని ఇతరులకు చాటుతోందని కొనియాడారు. సమున్నత కేదార్‌నాథ్ ఇప్పుడు అభివృద్ధి శిఖరాల దిశలో ఉందని మహాకాళ్ మహాలోక్ వారసత్వ వైభవాన్ని చాటుకొంటోందని తెలిపారు.

అజరామరానికి ఇవన్నీ కూడా సంకేతాలుగా నిలిచాయని చెప్పారు, బుద్ధ సర్కూట్ ఆరంభం తరువాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధ సోదరులను ఇండియాకు, ఇక్కడి ఆధ్యాత్మిక చింతనకు ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు శ్రీరాముడి మహావలయ నిర్మాణం పనులు మరింత వేగవంతం అవుతోంది. వచ్చే కొద్ది వారాలలో ఇందులో భాగంగా అత్యంత ప్రధానం, హృదయ స్పందన వంటి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి అవుతుందని వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాలు ఎన్ని జరగాలని అనుకున్నా, ఈ పవిత్ర మహాయజ్ఞాల దిశలో అడుగులు పడాలనుకున్నా ముందుగా మనం మన సామాజిక నిత్యసత్యాలను జీర్ణించుకోవల్సిందే.

మన సొంతమైన సాంస్కృతికతను గుర్తింపును నిలబెట్టుకోవల్సిందే అని తెలిపారు. దేశంలోని చారిత్రక స్థలాలను మరింతగా తీర్చిదిద్దడం జరుగుతోంది. ఇప్పుడు అత్యంత అధునాతన సౌకర్యాలతో ఇవి విలసిల్లుతున్నాయని, వారణాసి ఒక్కటి చాలు మన పూర్వ వైభవాన్ని మనం ఎంత శీఘ్రగతిన ముందుకు తీసుకువెళ్లుతున్నామనేది తెలియచేయడానికి సాక్షం అవుతుందన్నారు. ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి కూడా విచ్చేశారు. సిఎం ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రధాని కలియతిరిగారు. ఈ కేంద్రానికి పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకేసారి 20000 మంది వరకూ ఇక్కడ ఆసీనులై ధ్యానం సాగించవచ్చు.

ప్రజానీకానికి ప్రధాని నవ సంకల్పాలు
ప్రధాని సోమవారం వారణాసి నుంచి దేశ ప్రజల ముందుకు తొమ్మిది సంకల్ప తీర్మానాలు, పలు విజ్ఞప్తులు ప్రతిపాదించారు. దేశ సంక్షేమ సౌభాగ్యం కోసం వీటిని పూర్తి స్థాయిలో నెరవేర్చేందుకు అంతా కలిసి ఆచరించాలని, ఈ మేరకు ప్రతిన వహించాలని కోరారు. వారణాసిలో స్వర్‌వేద్ మహా మందిర్ ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ తెలిపారు.

ఆ తొమ్మిది ఇవే…
1. ప్రతి నీటి బొట్టును ఆదాచేయాలి. జలసంరక్షణలో పాలుపంచుకోవాలి
2. డిజిటల్ లావాదేవీలపై గ్రామగ్రామానికి వెళ్లి ప్రజలను చైతన్యపర్చాలి. ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించాలి
3. మీరుండే గ్రామ, పట్టణం, నగరం స్వచ్ఛతలో అగ్రగామి అయ్యేలా చూడాలి
4. స్థానిక స్వదేశీ ఉత్పత్తులను సాధ్యమైనంత వరకూ వాడాలి. వాడిపించాలి
5. దేశంలో మనం పలు ప్రాంతాలను సందర్శించాలి. పర్యాటకానికి జైకొట్టాలి
6. సహజసిద్ధ సాగుపద్ధతులపై రైతులను చైతన్యపర్చాలి. దీనితో ఈ నేల తల్లి పరిరక్షణ వీలవుతుంది. ఈ సందేశం ప్రచారం చేయాలి
7. తృణధాన్యాలు అయిన రాగులు ఇతరత్రాలను రోజువారి ఆహారంలో అంతర్భాగం చేసుకోవాలి. శ్రీ అన్నను ప్రోత్సహించాలి
8. శారీర ధారుఢ్యాన్ని పెంచుకోవాలి. యోగా లేదా క్రీడలకు ప్రాధాన్యతనివ్వాలి. జీవిత ప్రక్రియలో ఇదో అంతర్భాగం కావాలి
9. ఇది అత్యంత ముఖ్యమైనది ప్రతి ఒక్కరూ కనీసం ఓ పేద నిరుపేద కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలి. వారిని ఆదుకోవాలి. దేశంలో పేదరిక నిర్మూలనకు మీరు సైతం పాత్ర పోషించాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News