Tuesday, January 14, 2025

జెకె ప్రజలకు చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాను:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్ ప్రజలకు తాను చేసిన వాగ్దానాలను నెరవేరుస్తానని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం చెప్పారు. సరైన సమయంలో సరైన పనులు జరుగుతాయని ఆయన అన్నారు. సోనామార్గ్‌లో వ్యూహాత్మకంగా ముఖ్యమైన జడ్‌మోడ్ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన అనంతరం మోడీ ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ ఆ విషయం చెప్పారు. ఈ కార్యక్రమంలో తన ప్రసంగం సమయంలో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జెకెకు రాష్ట్ర హోదా పునరుద్ధరణను కోరిన కొద్ది సేపటికే మోడీ ఆ వ్యాఖ్యలు చేశారు. ‘ఇక్కడ ఉన్నది మోడీ అని, ఆయన తన వాగ్దానాలను నెరవేరుస్తుంటారని మీరు విశ్వసించవలసి ఉంటుంది. ప్రతి దానికీ సరైన సమయం ఉంది.

సరైన సమయంలో సరైన పనులు జరుగుతాయి’ అని మోడీ జెకె రాష్ట్ర హోదా పునరుద్ధరణ డిమాండ్‌ను ప్రస్తావించకుండా చెప్పారు. జమ్మూ కాశ్మీర్ దేశానికి కిరీటం అని, దానిని రమణీయంగా, సౌభాగ్యప్రదంగా చేయాలని వాంఛిస్తున్నానని కూడా ప్రధాని తెలిపారు. ‘జమ్మూ కాశ్మీర్ ప్రశాంత వాతావరణం ఉన్నది. పర్యాటకంపై దాని ప్రభావం చూశాం. కాశ్మీర్ ఇప్పుడు కొత్త అభివృద్ధి అధ్యాయాన్ని లిఖిస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్ లోయకు త్వరలోనే రైలు సౌకర్యం లభిస్తుందని, దాని గురించి ప్రజల్లో ఉత్సాహం కానవస్తోందని ఆయన తెలిపారు. నిరుడు అక్టోబర్‌లో సోనామార్గ్‌లో జడ్‌మోడ్ సొరంగ మార్గం సమీపంలో ఒక ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏడుగురు వ్యక్తులకు మోడీ నివాళులు కూడా అర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News