Tuesday, January 14, 2025

జెకెలో జడ్‌మోడ్ సొరంగాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

జమ్మూ కాశ్మీర్ సోనామార్గ్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా ముఖ్యమైన జడ్‌మోడ్ సొరంగ మార్గానికి ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభోత్సవం చేశారు. రూ. 2700 కోట్లు విలువ చేసే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ సొరంగం లోపలికి వెళ్లి ప్రాజెక్ట్ అధికారులతో ముచ్చటించారు. సొరంగ మార్గం పూర్తి చేయడానికి జటిల పరిస్థితుల్లో ఎంతో శ్రద్ధగా పని చేసిన నిర్మాణ కార్మికులను కూడా ఆయన కలుసుకున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పొల్గొన్నారు. ప్రధాని మోడీ సోమవారం ఉదయం 10.45 గంటలకు శ్రీనగర్ చేరుకుని, ప్రాజెక్ట్ ప్రారంభం కోసం అక్కడి నుంచి సోనామార్గ్‌కు హెలికాప్టర్‌లో వెళ్లారు. నిరుడు సెప్టెంబర్, అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం జమ్మూ కాశ్మీర్‌ను ప్రధాని సందర్శించడం ఇదే మొదటిసారి.

మధ్య కాశ్మీర్ గందెర్‌బల్ జిల్లాలో గగన్‌గిర్, సోనామార్గ్ మధ్య 6.5 కిమీ నిడివి గల రెండు లేన్ల ద్విదిశ రోడ్ సొరంగ మార్గానికి అత్యవసర పరిస్థితుల్లో తప్పించుకుని బయటపడేందుకు సమాంతరంగా 7.5 మీటర్ల మార్గం కూడా ఏర్పాటు చేశారు, సముద్ర మట్టానికి 8650 అడుగులు ఎత్తులో గల ఈ సొరంగ మార్గం కొండచరియలు, మంచుచరియల దుర్ఘటనలకు గురయ్యే మార్గాలను తప్పించుకుని లెహ్‌కు వెళ్లేందుకు శ్రీనగర్, సోనామార్గ్ మధ్య అన్ని కాలాల్లో అనుసంధానాన్ని పెంచుతుంది. ఏడాది పొడుగునా సోనామార్గ్‌కు అనుసంధానం కలిగించడం ద్వారా పర్యాటకాన్నీ ఈ సొరంగ మార్గం ప్రోత్సహిస్తుంది. 2028 నాటికి పూర్తి కాగల జోజిలా సొరంగ మార్గంతో పాటు జడ్‌మోడ్ సొరంగ మార్గం కాశ్మీర్ లోయ, లడఖ్ మధ్య దూరాన్ని 49 కిమీ నుంచి 43 కిమీకి తగ్గించి, వాహనాల వేగాన్ని గంటలకు 30 కిమీ నుంచి 70 కిమీకి పెంచుతుంది. ఈ అనుసంధాన మార్గం జమ్మూ కాశ్మీర్, లడఖ్ వ్యాప్తంగా రక్షణ విభాగానికి సంబంధించిన రవాణా సౌకర్యాలను పెంచుతుంది, ఆర్థిక వృద్ధికి, సాంఘిక, సాంస్కృతిక సమగ్రతకు వీలు కల్పిస్తుంది.

జడ్‌మోడ్ సొరంగ మార్గం నిర్మాణం 2015 మేలో మొదలైంది, ఇది 201617 నాటికి పూర్తి కావలసి ఉంది. కానీ ఒక దశాబ్దం ఆలస్యంగా పూర్తి అయింది. ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతను ఆదిలో చేపట్టిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఐఎల్ అండ్ ఎఫ్-ఎస్) ఆర్థిక ఒత్తిడి కారణంగా 2018లో పని నిలిపివేయడం వల్ల ప్రాజెక్టు ఆలస్యమైంది. రూ. 2716.90 కోట్లు విలువ చేసే ఈ ప్రాజెక్ట్‌కు 2012 అక్టోబర్‌లో అప్పటి భూతల రవాణా శాఖ మంత్రి సిపి జోషి, అప్పటి మంత్రివర్గ సహచరుడు ఫరూఖ్ అబ్దుల్లా, అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సమక్షంలో శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్‌కు 2019లో తిరిగి టెండర్లు ఆహ్వానించి, 2020 జనవరిలో తక్కువ బిడ్ చేసిన ఆప్కో ఇన్‌ఫ్రాటెక్‌కు కేటాయించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News