Monday, December 23, 2024

రష్యాఉక్రెయిన్‌పై మేం తటస్థం కాదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్ర విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందంటూ పశ్చిమదేశాలు ఆరోపించిన నేపథ్యంలో తాము తటస్థం కాదని, శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. అమెరికా పర్యటనకు బయలుదేరే ముందు వాల్ స్ట్రీట్ జర్నల్‌కు ఇచ్చిన ప్రత్యే క ఇంటర్వ్యూలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. “దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ చట్టాలను ప్రతిదేశం గౌరవించాలి.

దౌత్యపరమైన మార్గాలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలి. అంతేకానీ యుద్ధంతో కాదు” అని మోడీ పేర్కొన్నారు. సమస్య పరిష్కారం కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాల అధినేతలు పుతిన్, జెలెన్‌స్కీతో తాను పలుమార్లు మాట్లాడినట్టు ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భారత్ ఏం చేయగలదో అన్నీ చేస్తోందని, ఘర్షణలను పరిష్కరించి ఉభయదేశాల మధ్య శాంతి, స్థిరత్వాన్ని తీసుకు రాడానికి అన్ని ప్రయత్నాలను తాము సమర్ధిస్తున్నామని ప్రధాని వివరించారు.

భారత్‌చైనా మధ్య సంబంధాల గురించి ప్రస్తావిస్తూ ద్వైపాక్షిక సంబంధాలు నిలబడాలంటే, సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత , నిశ్చలమైన పరిస్థితులు చాలా ముఖ్యం. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపై మాకు విశ్వాసం ఉంది. అదే సమయంలో భారత్ తన గౌరవాన్ని , సార్వభౌమత్వాన్ని కాపాడుకోడానికి సంసిద్ధంగా ఉంది ” అని మోడీ పేర్కొన్నారు. భారత్ అమెరికా మధ్య బంధం ఇదివరకటి కంటే మరింత బలంగా ఉందని ప్రధాని మోడీ వివరించారు. ఇరు దేశాల నేతల మధ్య అమితమైన విశ్వాసం ఉందన్నారు.

ఇక ప్రపంచ రాజకీయాల గురించి స్పందిస్తూ “ ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో విస్తృత పాత్ర పోషించడానికి భారత్ అర్హమైనదే. విద్య, మౌలిక సదుపాయాల్లో భారత్ విస్తృత పెట్టుబడులు పెడుతోంది. ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల పరిస్థితుల్లో తయారీ, సరఫరా గొలుసును పెంపొందించడానికి బహుళ జాతి సంస్థలు తమవైపు చూస్తున్నాయి.అయితే మేం ఏ దేశ స్థానాన్నీ భర్తీ చేయాలనుకోవట్లేదు. కేవలం ప్రపంచంలో మేం సరైన స్థానాన్ని దక్కించుకోవాలని మాత్రమే కోరుకుంటున్నాం.” అని మోడీ వివరించారు. స్వాతంత్య్ర భారత దేశంలో పుట్టిన తొలి ప్రధాన మంత్రిని నేనే. అందుకే నా ఆలోచనా విధానాలు , ప్రవర్తన అన్నీ మాదేశ చరిత్ర, సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందినట్టుగానే ఉంటాయి. అదే నా బలం. దీన్నే నేను ప్రపంచానికి పరిచయం చేస్తున్నా” అని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News