అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కితాబు
జెర్సీ(అమెరికా): భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతంగా పనిచేస్తున్నారంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కితాబునిచ్చారు. భారత్‌కు తనకన్నా మంచి మిత్రుడు ఇప్పటివరకు ఎవరూ లేరని కూడా ఆయన చెప్పుకొచ్చారు. న్యూయార్క్ సమీపంలోని బెడ్‌మిన్‌స్టర్‌లోని గోల్ఫ్ క్లబ్‌లో ఎన్‌డి టివికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో భారత ప్రధాని మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ లేక మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వంటి వారి కన్నా భారత్‌తో మీకు మరింత మెరుగైన సంబంధాలు ఉన్నాయా అన్న ప్రశ్నకు ఈ ప్రశ్నను ప్రధాని మోడీకి మీరు వేయాలంటూ ట్రంప్ సూచించారు. తనతో మోడీకి ఉన్న స్నేహబంధం మరెవరితో లేదని కూడా ఆయన బదులిచ్చారు. భారతీయ సమాజం నుంచి లభించిన భారీ మద్దతుతోపాటు ప్రధాని మోడీతో తన అనుబంధాన్ని గురించి కూడా మోడీ మాట్లాడారు.
తాను అధ్యక్షుడిగా ఉన్న కాలంలో అమెరికా, భారత్‌లో జరిగిన భారీ సభలను గురించి ఆయన గుర్తు చేశారు. భారత్‌తో, ప్రధాని మోడీతో తనకు గొప్ప అనుబంధం ఉందని, తాము మంచి మిత్రులమని ట్రంప్ చెప్పారు. ఆయన(మోడీ) చాలా గొప్పవ్యక్తని, ప్రధానిగా అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ అన్నారు. ఆయన ఎంతో కష్టపడి ఆ పదవిలోకి వచ్చారని, తామిద్దరం చాలాకాలంగా ఒకరికొకరం తెలుసునని, మంచి వ్యక్తని అంటూ మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు. 2024లో తాను తిరిగి అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం లేకపోలేదని ఆయన సూచనప్రాయంగా వెల్లడించారు.