Saturday, November 23, 2024

ప్రగతి పథంలో కోట్ల ఉద్యోగాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ పురోగామ పథంలో ఉందని, ఆటోమొబైల్, పార్మా, టూరిజం ఇప్పుడు స్పేస్ వంటి రంగాల ద్వారా యువతకు ఉద్యోగాలు దక్కుతాయని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. యువతకు ఉద్యోగ ఉపాధికి సంబంధించి ఇది మోడీ గ్యారంటీ అని తెలిపారు. సోమవారం ప్రధాని మోడీ రోజ్‌గార్ మేళాను ఉద్ధేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా పరోక్ష పద్ధతిలో దేశంలోని యువతకు 51,000 ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. దేశం ఇప్పుడు వేగంగా పురోగమిస్తోందని తెలిపిన ప్రధాని , యువతకు ఉద్యోగ అవకాశాలతోనే ప్రగతి సార్థకం అవుతుందని తెలిపారు. ఆటోమొబైల్, ఔషధతయారీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసిసింగ్ వంటివి ఉద్యోగ కల్పనకు పట్టుగొమ్మలు అవుతాయని వివరించారు. అంతరిక్ష రంగంలో విజయాలతో ఇక యువతకు ఈ రంగం ద్వారా కూడా అపార ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయని ప్రధాని మోడీ చెప్పారు.

దేశంలోని సెంట్రల్ పారామిలిటరీ బలగాలు, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, ఢిల్లీ పోలీసు విభాగంలో ఉద్యోగ నియామక పత్రాలను ప్రధాని ఈ సందర్భంగా పంపిణీ చేశారు. భారతదేశం ప్రపంచ ఆర్థిక శక్తిగా మారుతోందని, త్వరలోనే టాప్ 3 ఎకనామిల్లో ఓ దేశం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ దశాబ్దంలోనే టాప్ 3 లోకి ఇండియా చేరుకుంటుందని, దీనితో సామాన్యుడికి మేలు జరుగుతుందని తెలిపారు. ఆర్థిక ప్రగతి సాధించాలంటే ప్రతి రంగం నిలదొక్కుకుని , సత్ఫలితాలకు దారితీయాల్సి ఉంటుంది. మారుతున్న ప్రపంచంలో పలు విధాలుగా ఉద్యోగాలకు అవకాశాలు ఉంటాయి. అయితే వీటిని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకుంటామనేది మన చేతుల్లో ఉంటుందని తెలిపారు. ఫుడ్ సెక్టార్ నుంచి ఫార్మాసిటికల్స్, మరో వైపు స్పేస్ నుంచి స్టార్టప్‌ల వరకూ ప్రతి రంగం వృద్ధితోనే దేశ ప్రగతి సాగుతుందన్నారు.

పర్యాటక రంగంతోనే రూ 20లక్షల కోట్లు
దీనితోనే 13 నుంచి 14 కోట్ల కొత్త జాబ్‌లు
రోజ్‌గార్ మేళ సందర్భంగా ప్రధాని మోడీ దేశ పర్యాటక రంగం వల్ల విశేష రీతిలో ప్రయోజనం ఉంటుందని తెలిపారు. 2030 టార్గెట్ పెట్టుకున్నామని, అప్పటికి ఈ రంగం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు దాదాపుగా రూ 20లక్షల కోట్లు దక్కుతాయి. అప్పటికి 14 కోట్ల మంది వరకైనా ఉద్యోగాలు ఖాయం అవుతాయని వివరించారు. ఇక ఔషధ పరిశ్రమ కూడా ఇప్పటి రూ నాలుగు లక్షల కోట్ల స్థాయి నుంచి 2030 నాటికి రూ 10 లక్షల కోట్ల దశకు చేరుతుందని విశ్వాసంవ్యక్తం చేశారు. యువత అవసరం వివిధ రంగాలకు ఉంది. రంగాల విస్తరణతో యువతకు పలు అవకాశాలు ఉంటాయని, ఈ విధంగా యువతకు ఉద్యోగాలపై మోడీ గ్యారంటీ ప్రకటిస్తున్నామని మోడీ చెప్పారు.

ఫుడ్ ప్రాసిసింగ్ రంగం విలువ గత ఏడాది లెక్కల ప్రకారం రూ 26లక్షల కోట్ల వరకూ ఉంది. ఇది మరో మూడున్నర ఏళ్లలో రూ 35లక్షల కోట్ల స్థాయికి చేరుకుంటుందని వివరించారు. ఈ దశలో ప్రధాని మోడీ ఉత్తరప్రదేశ్‌లో సుపరిపాలన వల్ల , అక్కడి పరిస్థితులు చక్కదిద్దే ప్రభుత్వం రావడం వల్ల పలు రకాల పెట్టుబడులు దూసుకువచ్చాయని, యుపిలో ఇటువంటి పరిస్థితి ఇంతవరకూ ఊహించనది అని తెలిపారు. భద్రతాయుత వాతావరణం ఉంటే ఎక్కడైనా వివిధ స్థాయిల్లో పెట్టుబడులకు వీలేర్పడుతుందని ప్రగతికి ఇదే తంత్రం మంత్రం అని స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News