ప్రకృతిని నాశనం చేసే పనిలో తెలంగాణ
ప్రభుత్వం రాష్ట్ర సర్కార్‌పై ప్రధాని మోడీ
తీవ్ర విమర్శలు వక్ఫ్ చట్టాన్ని తన
స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చిందని ఆగ్రహం
వందలాది మంది ముస్లిం వితంతువుల లేఖలే
వక్ఫ్ సంస్కరణలకు నాంది అని ప్రకటన
హిస్సార్ (హర్యానా): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధా ని నరేంద్ర మోడీ విమర్శలు గుప్పించారు. ఇటీవల హైదరాబాద్‌లో చర్చనీయాంశమైన కంచ గచ్చిబౌలి భూముల అంశాన్ని ప రోక్షంగా ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అడవుల్లోకి బుల్డోజర్ల ను పంపిస్తోందన్నారు. ప్రకృతి వినాశనానికి పాల్పడుతూ వన్యప్రాణులను వేటాడే పనిలో ఉందని దుయ్యబట్టారు. సోమవారంనాడు హర్యానాలోని హిస్సార్‌లో మహారాజా అగ్రసేన్ విమానాశ్ర యం నుంచి అయోధ్యకు తొలి విమాన సర్వీసును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం సభికులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు. అటవీ సంపదను హరించే పనిలో కాంగ్రెస్ బిజీగా ఉం దని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కూడా విస్మరించదని రేవంత్ ప్రభుత్వంపై మండిపడ్డారు. హస్తినలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వక్ఫ్ నిబంధనలను తమ స్వార్థానికి మార్చివేసిందని ఆయన ఆరోపించారు. ఆ పార్టీ షెడ్యూల్డ్ కులాలు (ఎస్‌సిలు),
షెడ్యూల్డ్ తెగలు (ఎస్‌టిలు), ఇతర వెనుకబడిన తరగతులు (ఒబిసిలు) వారిని ‘ద్వితీయ శ్రేణి పౌరులు’గా మార్చిందని మోడీ ఆరోపించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి విధ్వంసకురాలుగా కాంగ్రెస్ మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాల కారణంగా ముస్లిం సమాజం ఇక్కట్లు ఎదుర్కొన్నదని కూడా ఆయన ఆరోపించారు, ‘ఎన్నికల్లో వోట్లు రాబట్టడానికి వీలుగా కాంగ్రెస్ 2016 చివర్లో హడావిడిగా వక్ఫ్ చట్టానికి సవరణలు చేసింది. వారి ఈ చట్టాన్ని రాజ్యాంగానికి అతీతంగా చేశారు. అది బాబాసాహెబ్‌కు ఘోర అవమానం’ అని మోడీ ఆక్షేపించారు. ‘వోటు బ్యాంకు కోసం ఎవరు దురాశతోఉన్నారని వారిని అడగాలని అనుకుంటున్నాను. మీకు ముస్లింల పట్ల నిజంగా కొంత సానుభూతి ఉన్నట్లయితే కాంగ్రెస్ తమ అధ్యక్షునిగా ఒక ముస్లింను ఎందుకు నియమించలేదు. ముస్లిం అభ్యర్థులకు 50 శాతం టిక్కెట్లను ఎందుకు రిజర్వ్ చేయలేదు’ అని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాదాన్ని ఎదుర్కొన్నప్పుడల్లా పార్టీ పెద్దలు రాజ్యాంగాన్ని ‘తొక్కివేసింది’ అని కూడా మోడీ ఆరోపించారు. ‘1975 1977 ఎమర్జన్సీని ఆయన తన వాదనకు సమర్థనగా ఉటంకించారు. ‘రాజ్యాంగం స్ఫూర్తి ఉమ్మడి శిక్షా స్మృతి (యుసిసి) కలిగి ఉండడం. దానిని నేను సెక్యులర్ శిక్షా స్మృతి (ఎస్‌సిసి) అని పేర్కొంటాను. కానీ కాంగ్రెస్ దానిని ఎన్నడూ అమలు చేయలేదు’ అని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్‌లో బిజెపి ప్రభుత్వం యుసిసిపి అమలు చేయడాన్ని మోడీ ప్రస్తావిస్తూ, ‘ఈ దేశ దౌర్భాగ్యం చూడండి. రాజ్యాంగం ప్రతిని పట్టుకునే వారు ఈ కాంగ్రెస్ వారు దానిని వ్యతిరేకిస్తున్నారు’ అని అన్నారు. ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలకు రిజర్వేషన్ కల్పించాలన్న నిబంధన రాజ్యాంగంలో ఉందని, కానీ కాంగ్రెస్ వారి గురించి ఎన్నడూ శ్రద్ధ చూపలేదని ప్రధాని చెప్పారు. ‘బాబాసాహెబ్ అంబేద్కర్ సమానత్వాన్ని తీసుకురావాలని వాంఛించారు. కానీ కాంగ్రెస్ దేశంలో వోటు బ్యాంక్ (రాజకీయాలు) వైరస్‌ను వ్యాప్తి చేసింది. ప్రతి నిరుపేద గౌరవంగా జీవించాలని, తలలు ఎత్తి, కలలు కంటూ వాటిని సాఫల్యం చేయాలని ఆయన కోరుకున్నారు. కానీ కాంగ్రెస్ ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చివేసింది’ అని మోడీ విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షంపై తన విమర్శలకు మోడీ పదును పెడుతూ, కాంగ్రెస్ పవిత్ర రాజ్యాంగాన్ని ‘అధికారం కోసం ఒక ఆయుధంగా’ మార్చివేసిందని అన్నారు. కాంగ్రెస్ ఏళ్ల తరబడి పాలనలో పార్టీ నేతల ఈత కొలనులకు నీరు చేరిందని, కానీ కుళాయి నీళ్లు గ్రామాలకు చేరలేదని ఆయన విమర్శించారు.
‘స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల తరువాత కూడా గ్రామాల్లో కేవలం 16 శాతం ఇళ్లకు కుళాయి నీళ్లు అందుతున్నాయి& దీని వల్ల ఎవరు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు? ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలే’ అని ఆయన పేర్కొన్నారు. ‘గడచిన ఆరేడు సంవత్సరాల్లో మా ప్రభుత్వం 12 కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి నీటి కనెక్షన్లు ఇచ్చింది. 80 శాతం ఇళ్లు ఇప్పుడు కుళాయి నీళ్లు పొందుతున్నాయి. తక్కిన ఇళ్లకూ ఆ సౌకర్యం కల్పనకు మేము నిబద్ధమై ఉన్నాం’ అని ప్రధాని మోడీ తెలిపారు. తన ప్రభుత్వం 11 కోట్ల మరుగుదొడ్లు నిర్మించిందని మోడీ వెల్లడించారు. గతంలో మరుగుదొడ్లు లేనందును ఎస్‌సిలు, ఎస్‌టిలు, ఒబిసిలు ఎన్నో ఇక్కట్లు ఎదుర్కొన్నారని ఆయన చెప్పారు. ‘బాబాసాహెబ్ జీవించి ఉన్నప్పుడు ఆయనను కాంగ్రెస్ అవమానించింది, ఆయనను ఎన్నికల్లో రెండు మార్లు ఓడించింది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయనను గెంటివేయాలని చూసింది’ అని మోడీ ఆరోపించారు. అంబేద్కర్ జీవితంతో సంబంధం ఉన్న ప్రదేశాలను తన ప్రభుత్వ ‘పంచ్ తీర్థ్’గా అభివృద్ధి చేసిందని ఆయన తెలిపారు. హిస్సార్‌లో విమానానికి జెండా ఊపి ప్రారంభించి, శంకుస్థాపన చేసిన అనంతరం మోడీ కేంద్రంలో బిజెపి నాయకత్వంలోని ప్రభుత్వం నిరుపేదలకు సామాజిక న్యాయం, సంక్షేమం జరిగేలా చూస్తూనే అనుసంధానత పెంపుపై దృష్టి పెట్టిందని తెలియజేశారు. ‘ఇది అంబేద్కర్ కల’ అని మోడీ అన్నారు.
వందలాది ముస్లిం వితంతువుల లేఖలే వక్ఫ్ సంస్కరణలకు నాంది
హిస్సార్ : వందలాది మంది ముస్లిం వితంతువుల నుంచి వచ్చిన లేఖలే కేంద్రం వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని సంస్కరించే బాధ్యత చేపట్టడానికి దారి తీసినట్లు ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం వెల్లడించారు. వక్ఫ్ ఆస్తులను సక్రమంగా నిర్వహించినట్లయితే ముస్లిం యువకులు జీవనం సాగించేందుకు ‘సైకిల్ టైర్లకు పంక్చర్లు సరిచేసే పనికి పూనుకుని ఉండేవారు కాదు’ అని మోడీ అన్నారు. వక్ఫ్ (సవరణ) చట్టం 2025 అమలులోకి వచ్చిన తరువాత వారం లోపలే ప్రధాని మోడీ ఆ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రతిపాదిత చట్టానికి ఈ నెల 5న ఆమోద ముద్ర వేసిన తరువాత ప్రభుత్వం 8న చట్టాన్ని నోటిఫై చేసింది. పార్లమెంట్ చట్టాన్ని 4న ఆమోదించింది. హర్యానాలోని హిస్సార్‌లో ఒక ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, వక్ఫ్ ఆస్తులను దశాబ్దాల తరబడి దుర్వినియోగం చేశారని. దాని వల్ల నిరుపేద ముస్లింల బదులు భూమి మాఫియా లబ్ధి పొందిందని ఆరోపించారు.
‘వందలాది మంది ముస్లిం వితంతువులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన తరువాతే ఆ అంశంపై చర్చించి, తుదకుచట్టాన్ని మార్చడమైంది’ అని ప్రధాని మోడీ చెప్పారు. ‘ఇప్పుడు నిరుపేదల దోపిడీ ఎట్టకేలకు ఆగబోతున్నది. ఆ డబ్బును మొదటి నుంచి నిజాయతీగా వినియోగించి ఉన్నట్లయితే నా యువ ముస్లింలు సైకిల్ పంక్చర్లు సరిచేస్తూ జీవనం సాగించవలసి వచ్చేది కాదు’ అని ఆయన అన్నారు. వక్ఫ్ ఆస్తిగా చెప్పుకుంటున్న భూమిపై ఫిర్యాదులు ముస్లిమేతరుల నుంచే కాకుండా నిరుపేద ముస్లింల నుంచి కూడా వచ్చినట్లు ప్రధాని మోడీ వ్యాఖ్యల వల్ల తెలుస్తోంది. ‘కొత్త వక్ఫ్ చట్టం ప్రకారం, ఏ ఆదివాసీ ఆధ్వర్యంలోని భూమినీ లేదా ఆస్తినీ వక్ఫ్ బోర్డు దుర్వినియోగం చేయజాలదు. నిరుపేద, పస్మంద ముస్లింలు ప్రయోజనం పొందుతారు’ అని మోడీ చెప్పారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధాని మోడీ హిస్సార్‌లో మహారాజా అగ్రసేన్ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి, అయోధ్యకు తొలి విమాన సర్వీసును ప్రారంభించిన తరువాత సభలో ఆ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకులను ‘వోటు బ్యాంకు మోజు ఉన్న రాజకీయ నాయకులు’గా కూడా మోడీ విమర్శించారు. కాంగ్రెస్ ఒక ముస్లింను ఎన్నడూ తమ పార్టీ చీఫ్‌గా ఎందుకు నియమించలేదని మోడీ ప్రశ్నించారు.