Thursday, January 23, 2025

పిఎం సూర్యోదయ యోజన..కోటి ఇళ్లపై సౌరశక్తి యంత్రాల ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సాయంత్రం తమ ‘ప్రధానమంత్రి సూర్యోదయ యోజన’ను ప్రకటించారు. అయోధ్యలో శ్రీరామ ప్రతిష్టాపన ఘట్టంలో పాల్గొని వచ్చిన తరువాత తన తొలి నిర్ణయం ఇదే అని ప్రధాని మోడీ తెలిపారు. ఇది జన కల్యాణం, జన హితం పరిగణనలోకి తీసుకుని వెలువరిస్తున్న నిర్ణయం అని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల కరెంటు బిల్లుల భారం తగ్గించేందుకు, దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ పథకం తోడ్పడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా కోటి సోలార్ ప్యానల్స్ ఏర్పాటు జరుగుతుంది. దీనితో చవకగా విద్యుత్ బిల్లుల భారం గణనీయంగా తగ్గుతుందని ఆయన సామాజిక మాధ్యమం ద్వారా ప్రజలతో తన ఆలోచనలు పంచుకున్నారు. అయోధ్యలో మధ్యాహ్నం వరకూ తీరిక లేకుండా గడిపి, దేశ రాజధానికి చేరుకోగానే ప్రధాని ఈ నిర్ణయం ప్రకటించారు. దేశమంతటా తొలివిడతలో కోటి ఇండ్లపై సౌర శక్తి గ్రాహక ప్యానల్స్ ఏర్పాటు జరుగుతుంది.

దీని వల్ల ఉత్పత్తి అయ్యే సౌరశక్తితో ప్రజలకు విద్యుత్ అవసరాలు తీరుతాయని వివరించారు. సూర్యవంశానికి చెందిన శ్రీరాముడి భక్తులు అంతా ఈ సౌరశక్తితో ఇంధన అవసరాలు తీర్చుకోవచ్చునని, ఈ వాస్తవం తాను గుర్తించానని తెలిపారు. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు ప్రక్రియ గురించి అంతకు ముందు ప్రధాని మోడీ సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ప్రజలకు అవసరం అయిన విద్యుత్ ఇతరత్రా ఇంధన అవసరాలను వారి ఇళ్లపై నెలకొని ఉన్న సౌర మరల ద్వారానే సేకరించుకునేందుకు వీలేర్పడుతుందని వివరించారు. రామ ప్రతిష్టాపన స్ఫూర్తితో ఈ నిర్ణయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. రాముడు అగ్ని కాదు, ఇంధన శక్తి, రాముడు వివాదాస్పదుడు కాడు. పరిష్కర్త. రాముడు కేవలం సొంతమే కాదు, అందరికి చెందినవాడని కొనియాడారు. ఆయన సార్వత్రికుడు అని తెలిపారు. ఇప్పుడు అయోధ్యలో జరిగింది కేవలం రామ్‌లల్లా విగ్రహాల ప్రాణప్రతిష్టగానే భావించరాదు. ఇందులో అంతకు మించిన పరమార్థం ఉందని ,

భారతదేశ ఐక్యతను చాటిచెప్పే ఘట్టం అని, మన నమ్మికలకు ప్రతిష్ట పెరిగిన సమయం అన్నారు. ప్రధాని మోడీ ఢిల్లీలో తన నివాసం చేరుకున్న తరువాత అక్కడ దియాలను వెలిగించారు. ఇప్పుడు దీపాలను వెలిగించాం, ఇక సౌరకాంతులు ప్రసరింపచేసుకుందామని పిలుపు నిచ్చారు. అయోధ్య రామాలయం శాంతి, సహనం, సామరస్యం, సహోదరత్వం, మిత్రత్వపు లక్షణాల భారతీయ సమాజానికి ప్రతీక అని తెలిపారు. అయోధ్య నుంచి తిరిగిరాగానే కొద్ది సేపు విశ్రాంతి తీసుకుని ప్రధాని వెంటనే తన దైనందిన అధికారిక సమీక్షలకు దిగారు. ఫైళ్లను పరిశీలించారు. అధికారులతో పలు విషయాలపై సమీక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News