Friday, December 20, 2024

పిఎం కిసాన్ నిధుల విడుదల..

- Advertisement -
- Advertisement -

రాంచీ : రైతులకు పెట్టుబడి సాయం కోసం కేంద్రం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం కిసాన్ ) 15 వ విడత నిధులను ప్రధాని మోడీ బుధవారం ఝార్ఖండ్ లోని కుంతీలో విడుదల చేశారు. ఈ పథకం ద్వారా సుమారు 8 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.2 వేలు నగదు జమ అవుతుంది. అయితే ఈ నిధుల విడుదలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ (రెండో విడత ) , తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పీఎం కిసాన్ నిధుల విడుదల ఆలస్యం కావడంపై కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ అనుమానాలు వ్యక్తం చేశారు. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే నిధుల విడుదలలో జాప్యం చేసిందని ఆరోపించారు.

ఆదివాసీల కోసం పీవీటీజీ
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఝార్ఖండ్‌లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ రూ.24 వేల కోట్లతో ఆదివాసీల సంక్షేమం కోసం ప్రధాన మంత్రి అత్యంత వెనుకబడిన ఆదివాసీ బృందాలకు చేయూత పథకాన్ని ప్రారంభించారు. దీని ద్వారా దేశం లోని 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అడవులు, పర్వతాల్లోని మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న 28 లక్షల మంది ఆదివాసీల కోసం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా రోడ్డు, ఫోన్ కనెక్టివిటీ, పరిశుభ్రమైన తాగునీరు, ఇళ్లనిర్మాణం, పారిశుధ్యం, విద్య, వైద్యం, పౌష్టికాహారం, స్థిరమైన జీవనోపాథిని వారికి కల్పించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

మరోవైపు ఖనిజవనరులను వెలికితీసే క్రమంలో నిర్వాసితులైన ఆదివాసీల కోసం ప్రత్యేక పథకాలు తీసుకురావాలని ప్రధాని మోడీని ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ కోరారు. అంతకు ముందు ఆదివాసీ నాయకుడు బిర్సా ముండా జయంతి సందర్భంగా ఝార్ఖండ్‌లో ఆయన జన్మస్థలమైన ఉలిహుటుకులో ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఉలిహుటుకును సందర్శించిన తొలి ప్రధాని మోడీనే కావడం విశేషం. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు ప్రధానికి సంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News