ఒడిశాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ తన 75 వ పుట్టిన రోజు సందర్భంగా మహిళలకు ఆర్థిక ప్రయోజనం కలిగించే సుభద్రయోజన పథకాన్ని మంగళవారం ప్రారంభించారు. ఒడిశా లోని అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు ప్రధాని చేశారు. ఒడిశా ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ సుభద్రయోజన పథకం వల్ల అర్హులైన మహిళలకు ఏటా రూ. 10 వేలు రాష్ట్రప్రభుత్వం అందిస్తుంది. 21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు కోటి మంది లబ్ధిదారులైన మహిళల రెండు విడతల్లో రూ.5 వేలు వంతున మొత్తం రూ. 10 వేలు జమ అవుతుంది.
2024-25 నుంచి 2028-29 వరకు ఐదేళ్ల పాటు ఈ ఆర్థికసాయం అందుతుంది. ఇప్పటికే 60 లక్షల మంది మహిళలు ఈ పథకంలో లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. ఈ నెల 15 వ తేదీలోపు నమోదు చేసుకున్న వారి ఖాతాల్లో మంగళవారం తొలి విడత నగదు జమ చేశారు. ఈ పథకం కోసం ఒడిశా ప్రభుత్వం సుమారు రూ. 55, 825 కోట్లు కేటాయించింది. ఒడిశా లోని ఇతర ప్రభుత్వ పథకాల ద్వారా ఏడాదికి రూ. 18 వేలు పొందే మహిళలు ఈ సుభద్రయోజనకు అర్హులు కారని ఒడిశా ప్రభుత్వం స్పష్టం చేసింది.