భారీ దూరదృష్టి ఉన్నప్పుడే దేశం ఉన్నత విజయాలను లక్షం చేసుకోగలదని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఉద్ఘాటించారు. సాంకేతిక పరిజ్ఞానం మెరుగుదల పేదలను సాధికారులను చేసేదిగా ఉండాలని ప్రధాని స్పష్టం చేశారు. జాతీయ సూపర్ కంప్యూటింగ్ మిషన్ (ఎన్‌ఎస్‌ఎం) దేశీయంగా అభివృద్ధి చేసిన మూడు పరమ్ రుద్ర సూపర్ కంప్యూటర్లను వీడియో లింక్ ద్వారా ఆవిష్కరించిన అనంతరం మోడీ ప్రసంగిస్తూ, ఆస్కారాల అనంత ఆకాశంలో నూతన అవకాశాలను భారత్ సృష్టిస్తున్నదని చెప్పారు. టెక్నాలజీలో పరిశోధన సామాన్యునికి ప్రయోజనం కలిగించేలా తన ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని మోడీ తెలిపారు. ‘2015లో సూపర్ కంప్యూటింగ్ మిషన్‌ను ప్రారంభించాం. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ముందడుగు వేసింది.
ఇది ఐటి, తయారీ, ఎంఎస్‌ఎంఇలు, స్టార్టప్‌ల మెరుగుదలకు దోహదం చేస్తుంది’ అని ఆయన చెప్పారు. తన ప్రభుత్వం సైన్స్, టెక్నాలజీ, పరిశోధనలకు ప్రాధాన్యం ఇస్తున్నదని మోడీ తెలియజేశారు. ‘మిషన్ గగన్‌యాన్ సన్నాహాలు మొదలయ్యాయి. 2035 నాటికి మనం సొంత అంతరిక్ష కేంద్రం కలిగి ఉంటాం’ అని ఆయన చెప్పారు. ఆ ప్రాజెక్ట్ మొదటి దశను ఆమోదించినట్లు ప్రధాని తెలిపారు. ‘స్వావలంబనకు సైన్స్ అన్నది మా లక్షం’ అని మోడీ తెలిపారు. రూ. 130 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు సూపర్ కంప్యూటర్లను ప్రథాన వైజ్ఞానిక పరిశోధనకు దోహదంచేసేలా పుణె, ఢిల్లీ, కోల్‌కతాలలో మోహరించారు. వాతావరణ, పర్యావరణ పరిశోధనకు అనుకూలంగా రూపొందించిన రూ. 850 కోట్ల ‘హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్‌పిసి) వ్యవస్థను కూడా మోడీ ప్రారంభించారు. సైన్స్, టెక్నాలజీ రంగంలో ‘అతి పెద్ద విజయం’ సాధించిన దినంగా గురువారాన్ని (26ను) ఆయన అభివర్ణించారు. ‘టెక్నాలజీ, కంప్యూటింగ్ సామర్థంపై ఆధారపడని రంగం ఏదీ లేదు’ అని మోడీ చెప్పారు.
‘ఈ విప్లవంలో మన వాటా తునకలు, బైట్లుగా కాకుండా టెరాబైట్స్, పెటాబైట్స్‌లో ఉండాలి. అందువల్ల మనం సరైన వేగంతో సరైన దిశలో సాగుతున్నట్లు ఈ విజయం రుజువు చేస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు. ‘సైన్స్ ప్రాముఖ్యత సృజనాత్మకత, అభివృద్ధిలోనే కాకుండా చివరి వ్యక్తి ఆకాంక్షలను పరిపూర్త చేయడంలో కూడా ఉంది’ అని మోడీ తెలిపారు. భారత్ సొంత సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ నిర్మిస్తున్నదని, అది గ్లోబల్ సప్లయి చైన్‌లో కీలక భాగం కాగలదని మోడీ తెలిపారు.