లక్నో: ప్రధాని నరేంద్రమోడీ తన సొంత నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శనివారం నాడు శంకుస్థాపన చేశారు. మహదేవుని నగరంలో శివతత్వం ఉట్టిపడే డిజైన్‌తో నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని మహదేవునికే అంకితం చేయనున్నట్టు మోడీ ఈ సందర్భంగా ప్రకటించారు. కాశీ లోని అంతర్జాతీయ స్టేడియం నిర్మాణంతో స్థానిక క్రీడాకారులకు ఎంతో ప్రయోనం చేకూరుతుందన్నారు. పూర్వాంచల్ ప్రాంతానికి ఈ స్టేడియం తలమానికమని పేర్కొన్నారు.
ఈరోజు నుంచి ఆసియన్ గేమ్స్ ప్రారంభమవుతున్నాయని, ఈ క్రీడల్లో భారతదేశం సాధిస్తున్న విజయాలు క్రీడల పట్ల మన దృక్కోణం మారుతోందనడానికి సాక్షంగా నిలుస్తోందన్నారు. క్రీడాకారులకు ప్రతిస్థాయి లోనూ ప్రభుత్వం తోడ్పాటునందిస్తోందని తెలిపారు. అలాంటి ప్రభుత్వ పథకాల్లో టీఓపీఎస్ ఒకటని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, మదన్‌లాల్, దిలీప్ వెంగ్‌సర్కార్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా , సెక్రటరీ జే తదితరులు పాల్గొన్నారు.
రూ.450 కోట్లతో స్టేడియం
ఇదిలా ఉండగా ఈ స్టేడియాన్ని కాశీవిశ్వేశ్వరుని స్ఫూర్తితో డిజైన్ చేస్తున్నారు. అర్ధచంద్రాకారం తరహాలో రూఫ్ కవర్, త్రిశూలం తరహాలో ఫ్లడ్‌లైట్లు, ఘాట్ మెట్ల తరహా సీటింగ్ ఏర్పాట్లు వంటివి ఉండబోతున్నాయి. 30,000 మంది ప్రేక్షకులు కూర్చునేందుకు అవకాశం ఉన్న ఈ స్టేడియాన్ని 30 నెలల్లో పూర్తి చేయనున్నారు. రూ. 450 కోట్ల వ్యయంతో 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రాజెక్టు నిర్మాణం కానుంది. భూమి సేకరణ కోసం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రూ.121 కోట్ల వెచ్చించింది. బీసీసీసీఐ రూ. 331 కోట్లు ఈ ప్రాజెక్టుకు ఖర్చు చేయనుంది