జి 7 శిఖరాగ్ర సదస్సు ఔట్‌రీచ్ సెషన్‌లో పాల్గొనేందుకు భారత ప్రదాని నరేంద్ర మోడీ గురువారం ఇటలీకి బయలుదేరారు. మూడోసారి ప్రధాని అయిన తరువాత మోడీ తొలి విదేశీ పర్యటన ఇదే. ఈ నేపథ్యంలో ప్రధాని తమ ప్రకటన వెలువరించారు. కృత్రిమ మేధ(ఎఐ), ఇంధనం, ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతం వంటి కీలక విషయాలు ఈ వేదిక నుంచి ప్రస్తావనకు వస్తాయని ఆయన వివరించారు. ప్రధాని ఇటలీ పర్యటన ఇంతకు ముందే ఖరారు అయింది. జి 7 సదస్సులో గ్లోబల్ సౌత్‌కు సంబంధించిన పలు విషయాలు ప్రస్తావనకు వస్తాయని తెలిపారు. ఇటలీలోని అపూలియా ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన బోర్గో ఎగ్నాజియా రిసార్ట్‌లో ఈ నెల 13 నుంచి 15 వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి. ఇటలీ ప్రధాని జియోజియా మెలోని ఆహ్వానం మేరకు తాను వెళ్లుతున్నానని కూడా ప్రధాని తెలిపారు.
జి 7 వేదికలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. సమావేశాలలో గాజాలో ఘర్షణ, ఉక్రెయిన్‌లో పరిస్థితి కూడా ప్రస్తావనకు వస్తుందని వెల్లడైంది. జి 7కు ఈసారి ఇటలీ అధ్యక్షత హోదాలో సమావేశాలు నిర్వహిస్తోంది. తిరిగి అధికారం చేపట్టిన తరువాత విదేశాలకు వెళ్లుతున్న దశలో ఈ కీలక వేదికపై ఆయన పలువురు ప్రముఖ నేతలతో ద్వైపాక్షిక చర్చలకు వీలుంటుంది. ఈ నేపథ్యంలో అభినందనలు కూడా స్వీకరిండం జరుగుతుందని అధికారులు తెలిపారు. జి 7 సదస్సుకు ఇండియాతో పాటు మరో 11 దేశాల నేతలకు ఇటలీ నుంచి ఆహ్వానాలు అందాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఇండో పసిఫిక్ ప్రాంతంలోని 11 అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రతినిధులు కూడా ఈ సదస్సుకు తరలివస్తున్నారు.