న్యూఢిల్లీ: బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దక్షినాఫ్రికాకు బయల్దేరి వెళ్లారు. వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలతోపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో కూడా ప్రధాని మోడీ సమావేశం కానున్నారు.
15వ బ్రిక్స్ సదస్సు వివిధ సభ్య దేశాల మధ్య సహకారానికి సంబంధించి కొత్త రంగాలను గుర్తించడంతోపాటు వ్యవస్థాపరమైన అభివృద్ధిని సమీక్షించడానికి అవకాశం కల్పించగలదని ప్రధాని దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆశాభావం వ్యక్తం చేశారు.
జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్ సదస్సులో పాల్గొనడంతోపాటు బ్రిక్స్ ఆఫ్రికా ఔట్‌రీచ్, బ్రిక్స్ ప్లస్ డైలాగ్ ఈవెంట్స్‌లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ నెల 22 నుంచి 24 తేదీ వరకు జొహాన్నెస్‌బర్గ్‌లో ప్రధాని ఉంటారు. బ్రిజెల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాలతో కూడిన బ్రిక్స్ 2019 తరువాత సమావేశం కావడం ఇదే మొదటిసారి. అక్కడ నుంచి ప్రధాని మోడీ అతి ప్రాచీన నగరం ఏథెన్స్‌ను సందర్శిస్తారు. 40 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని గ్రీస్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి.