Monday, December 23, 2024

ఎర్రకోట నుంచి ఎన్నికల ప్రచారం

- Advertisement -
- Advertisement -

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విభిన్నమైన నేత. సాంప్రదాయ రాజకీయాలను పక్కకు నెట్టివేసి తన చుట్టూ రాజకీయాలను కేంద్రీకృతం చేసుకోవడంలో దిట్ట. ప్రపంచంలో పురాతనమైన, అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను ప్రపంచం ముందుంచే ప్రయత్నం ఒకవంక చేస్తూ, మరో వంక ప్రాథమిక ప్రజాస్వామిక సూత్రాలకు తిలోదకాలివ్వడం ఆయనకే చెల్లుబాటు అవుతుంది. ప్రధాన మంత్రులు ఎవరైనా ఆగస్టు 15న ఎర్రకోట నుండి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం ఓ గొప్ప గౌరవంగా భావిస్తుంటారు. ఈ సందర్భంగా పార్టీ రాజకీయాలకు అతీతంగా జాతి మనుగడకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తుంటారు. ఇప్పటి వరకు ప్రధాన మంత్రులు ఎవరు ఎర్రకోట నుండి చేసిన ప్రసంగాలలో తమ వల్లనే దేశంలో అంతా జరుగుతుందంటూ తమ పేరు ప్రస్తావించుకున్న వారెవ్వరూ బహుశా లేరు. చివరకు నేటి ప్రపంచంలో కరడుగట్టిన నియంతగా భావించే ఉత్తర కొరియా అధినేత కిమ్ సహితం ఎప్పుడూ తన పేరును తన ప్రసంగంలో ప్రస్తావించడు.

ఒకసారి కాదు ఏడు సార్లు తన పేరును తానే ప్రస్తావించుకొని సరికొత్త చరిత్రకు నాంది పలికారు.నేడు దేశం సాధిస్తున్న అభివృద్ధి అంతా తనవల్లనే అనే విధంగా మాట్లాడారు. కనీసం తన ప్రభుత్వ విజయంగా కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. తిరిగి వచ్చే ఏడాది కూడా తానే ఈ రోజున ఇక్కడి నుండి ప్రసంగిస్తానని చెప్పడం ద్వారా 2024 ఎన్నికల్లో మరోసారి గెలుపొందబోతున్నట్లు చెప్పి ఎన్నికల ప్రసంగంగా మార్చుకున్నారు. నేడు దేశం ఐదో ఆర్ధికశక్తిగా ఎదగడానికి కారణం ‘మోడీ హామీ’ ఇవ్వడం అని చెప్పుకున్నారు. ఆర్థిక సంస్కరణలు సహితం 2014 నుండి ‘మోడీ సాహసం’ కారణంగా ఉధృతంగా అమలవుతున్నట్లు చెప్పారు.జిడిపిని బట్టి ప్రపంచంలో ఇదో పెద్ద ఆర్థిక శక్తిగా వున్నప్పటికీ సగటు ఆదాయంలో ప్రపంచంలోని 197 దేశాల్లో 142వ స్థానంలో భారత్ ఉందని, జి 20 దేశాల్లో చిట్టచివర ఉందనే వాస్తవాన్ని మాత్రం ప్రస్తావించే సాహసం చేయడంలేదు. దేశ ప్రజల ప్రగతికి ఇదే కీలకం అని మరిచారా? 2014కు ముందు మూడు దశాబ్దాల పాటు దేశం ‘అస్థిరత, అనిశ్చిత, రాజకీయ నిస్సహాయత’ పరిస్థితులను ఎదుర్కొన్నట్లు విమర్శించారు.

అందులో ‘దేశం వెలిగిపోతోంది’ అని బిజెపి గతంలో విస్తృతంగా ప్రచారం చేసిన ఆరేళ్ళ వాజపేయి ప్రభుత్వం కూడా ఉందనే అంశాన్ని మర్చిపోయినట్లున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఓ ప్రధాని మొత్తం దేశ ప్రజల ప్రతినిధిగా ప్రసంగించడం పరిపాటిగా వస్తుంది. దేశాభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాల కృషి కూడా ఎంతో ఉంటుంది. దేశంలో దాదాపు సగం రాష్ట్ర ప్రభుత్వాలు బిజెపి నేతృత్వంలో ఉన్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పని తీరు కొన్ని అంశాలలో మొత్తం దేశానికే మార్గదర్శిగా ఉంది. కానీ, వారెవ్వరికి ఎటువంటి క్రెడిట్ ఇచ్చేందుకు ప్రధాని సిద్ధంగా లేరని ఆయన ప్రసంగం స్పష్టం చేస్తుంది.
దేశంలో మోడీ ప్రజాదరణకు, ఎన్నికల ఎత్తుగడలకు, ఎన్నికల సమయంలో ఉపయోగించే విస్తృతమైన వనరులతో పోటీపడగల నేత, పార్టీ నేడు లేదని ధీమా మొన్నటి వరకు ఉండెడిది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇప్పటి వరకు నమ్ముకున్న అంశాలను వమ్ముచేశాయి. అదే సమయంలో ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడం సహితం కలవరం కలిగిస్తున్నట్లు అప్పటి నుండి ప్రధాని మోడీ, బిజెపి అగ్రనాయకత్వం ధోరణులు స్పష్టం చేస్తున్నాయి.

ముఖ్యంగా అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ఈ అంశం వెల్లడైంది. కేవలం ఓ కూటమిగా ఏర్పడి, ఎన్నికల పొత్తు ఏర్పాటు చేసుకుని, ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా పోటీ చేసినంత మాత్రాన మోడీని ఓడించడం సాధ్యం కాదని ఈ సందర్భంగా పేలవమైన కాంగ్రెస్ నేతల ప్రసంగాలు వెల్లడి చేశాయి. లోక్‌సభలో బిజెపికి సొంతంగానే ఆధిక్యత ఉండడంతో ఈ తీర్మానం నెగ్గే అవకాశం లేదని ప్రతిపక్షాలకు తెలుసు. అయితే ముఖ్యంగా మణిపూర్ హింసాకాండ గురించి మౌనంగా ఉంటున్న ప్రధాని మోడీతో పాట్లాడించేందుకే దీనిని ప్రవేశపెట్టామని చెబుతూ వచ్చా రు. అయితే మణిపూర్‌లో అసలేమి జరుగుతున్నదో ఈ చర్చ ద్వారా దేశ ప్రజల ముందుంచడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. నాలుగు నెలలకు పైగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు నిర్ణయంతో అంతకు ముందు రోజే పార్లమెంట్ లో అడుగు పెట్టడం, పైగా ఆయన స్వయంగా మణిపూర్‌లో పర్యటించి రావడంతో అక్కడ అసలేమీ జరుగుతుందో చెబుతారని ఎదురు చూసిన వారికి నిరాశ కలిగింది.ఒక విధంగా కాంగ్రెస్ పార్టీతో పాటు మొత్తం ఇండియా కూటమిని ఆత్మరక్షణలో పడేశారు.

తాను ఎప్పుడు సభలో మాట్లాడాలి అనుకొంటున్నారో ముందుగా సహచరులకు చెప్పకుండా వారిని గందరగోళానికి గురిచేశారు. ఆయనే చర్చను ప్రారంభిస్తారని స్పీకర్‌కు తెలిపారు. అయితే ఐదు నిమిషాల ముందు తీర్మానాన్ని ప్రతిపాదించిన గౌరవ్ గోగాయిని మాట్లాడమని రాహుల్ చెప్పారు. మూడో రోజు ప్రధాని మోడీ ప్రసంగించే రోజే రాహుల్ మాట్లాడతారని కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. కానీ అకస్మాత్తుగా రెండో రోజు ఆయన ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి ఎంతో సమాచారం కూర్చి సిద్ధం చేస్తే, ఆ పత్రాలను అసలు చూడకుండా తోచిన మాటలు మాట్లాడారు. ‘నా మాత భారత్ మాతను హత్యా చేశారు’ అంటూ భావోద్వేగంగా మాట్లాడి ప్రజల దృష్టి ఆకట్టుకునే విఫల ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఆయన ప్రసంగం చాలా పేలవంగా ఉందని అందరూ పెదవి విరుస్తున్నారు. ప్రధానిని ప్రసంగించేందుకు పార్లమెంట్ సమావేశాలు జరగనీయకుండా గందరగోళ దృశ్యాలు సృష్టిస్తూ, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత తీరా ప్రధాని ప్రసంగం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్షాలు సభ నుంచి బహిష్కరించడం అనాలోచిత చర్యగా స్పష్టం అవుతుంది. ప్రతిపక్షాలు బైటకు వెళ్లిన తర్వాతనే మోడీ మణిపూర్ ప్రస్తావన తీసుకొచ్చారు. పైగా ప్రధాని ప్రసంగాన్ని తిప్పికొట్టే అవకాశాన్ని తీర్మానం ప్రతిపాదించిన గౌరవ్ గోగాయి సభ నుంచి బహిష్కరించడం ద్వారా పోగొట్టుకున్నారు.

మరోవంక బిజెపి సభ్యులు వ్యూహాత్మకంగా తమ ప్రభుత్వ విజయాలను గురించి కాకుండా ప్రతిపక్షాలపై ఎదురు దాడికి దిగారు. ముఖ్యంగా ఇండియా కూటమికి నేతృత్వం వహిస్తున్న కాంగ్రెస్‌ను, ఆ పార్టీని నడిపిస్తున్న గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రధాని మోడీ అయితే రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. 2019 ఎన్నికల మాదిరిగా 2024లో కూడా మోడీ – రాహుల్ మధ్య పోరాటంగా జరిగితే సహజంగా ప్రజలు మోడీ వైపు చేరుతారని వ్యూహాత్మకంగా బిజెపి వ్యవహరిస్తున్నది. మోడీని ఓడించడం కోసం కూటమిగా ఏర్పడిన ప్రతిపక్షాలు ఈ కూటమి సమిష్టిగా పని చేసేటట్లు చూడటం పట్ల ఏ మేరకు సీరియస్‌గా ఉన్నాయో గాని, ఆ కూటమి ఉనికి పట్ల బిజెపి, ముఖ్యంగా ప్రధాని మోడీ ఆందోళనగా ఉన్నట్లు స్పష్టం అవుతుంది.అందుకనే వెంటనే పార్టీలో, ప్రభుత్వంలో మార్పులపై దృష్టి సారిస్తున్నారు. అంతేకాదు, గత ఐదేళ్లుగా పట్టించుకోని ఎన్‌డిఎను తిరిగి క్రియాశీలం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోడీ పలు నూతన పథకాలు ప్రకటించడం, ఆ మరుసటి రోజే రూ 1.18 కోట్ల వ్యయం కాగల పథకాలను ఆమోదించారు.

అంటే, తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలు అంటూ మొన్నటి వరకు బిజెపి శ్రేణులు దేశం అంతటా చేసిన ప్రచారంతో 2024లో తిరిగి అధికారంలోకి రాలేమని గ్రహించినట్లు వెల్లడవుతుంది. మరో తొమ్మిది నెలల్లో జరిగే ఎన్నికల్లో ప్రజలను ప్రభావితం చేసేందుకు 5 నుండి 10 ఏళ్ళ కాలంలో అమలు చేయబోయే పథకాలను ప్రకటించడం వారిలో నెలకొన్న అభద్రతా భావాన్ని స్పష్టం చేస్తున్నది. ‘ఇండియా’ కూటమి ఇప్పుడు మోడీ నాయకత్వంలోని బిజెపిని ఎదుర్కొనే ఎత్తుగడలపై కాకుండా అంతర్గత వైరుధ్యాలను సరిదిద్దుకోవడంలో తలమునకలవడం మరోవంక కనిపిస్తుంది. ఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ సీట్లకు పోటీ చేయాలనీ కాంగ్రెస్ అనుకున్నట్లు ప్రకటించగానే ఇండియా నుండి వైదొలుగుతామని ఆప్ బెదిరించడం, వెంటనే ఆ ప్రకటనను కాంగ్రెస్ తోసిపుచ్చడం చూసాము. మరోవంక, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను తీసుకు వస్తే గాని బిజెపితో చేతులు కలిపి, ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టిన అజిత్ పవార్‌కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని బిజెపి స్పష్టం చేసినట్లు తెలుస్తున్నది. అందుకనే శరద్ పవార్‌ను కలుస్తూ కేంద్ర ప్రభుత్వంలో చేరమని ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు మహారాష్ట్రలో రెండు కూటమిలలో కూడా అస్థిరతకు దారి తీస్తున్నాయి.

ఇక బీహార్‌లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇండియా కూటమి ఏర్పాటు పట్ల మొదట్లో చూపిన ఉత్సాహాన్ని ఇప్పుడు రాహుల్ గాంధీ తానే దానికి నాయకుడు అన్నట్లు వ్యవహరించడం ప్రారంభించగానే చూపడం లేదు. బిజెపికి సానుకూల సంకేతాలు పంపుతున్నారు. ఆగస్టు 15న లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి, తేజస్వి యాదవ్‌ల సమక్షంలో 2006లో తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టే వరకు బీహార్ అంధకారంలో ఉందన్నట్లు లాలూ,- రబ్రీ పాలనపై పరోక్షంగా విసుర్లు విసిరారు. అప్పటి వరకు యువతకు ఉపాధి అవకాశాలు గాని, మంచి చదువులు గాని ఉండెడివి కావని, ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళలకు రక్షణ ఉండెడిది కాదంటూ చెప్పుకొచ్చారు. ఆ మరుసటి రోజే ప్రత్యేకంగా ఢిల్లీకి వెళ్లి వాజపేయి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ తనను ముఖ్యమంత్రి చేసింది ఆయనే అన్నట్లు గుర్తు చేసుకున్నారు. అయితే, ఎన్ని పాట్లుపడినా నితీశ్‌కు బిజెపి శాశ్వతంగా ద్వారాలు మూసివేసింది ఒకప్పటి ఆయన మిత్రుడు, బిజెపి నేత సుశీల్ మోడీ స్పష్టం చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ తిరిగి లోక్‌సభలో ప్రవేశించడంతో 2024 ఎన్నికలకు ఆయన నేతృత్వంలో ఇండియా కూటమి పనిచేయాలి అనుకొంటూ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తే అందుకు భాగస్వాములైన ప్రాంతీయ పార్టీలకు ఇబ్బందికరమే కాగలదు. అందుకనే ప్రధాని మోడీ పదేపదే రాహుల్ పేరు తీసుకు రావడం ద్వారా ఇండియా కూటమిలో బీటలు ఏర్పడేటట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News