Friday, November 15, 2024

మన్‌కీ బాత్ శతకం

- Advertisement -
- Advertisement -

ప్రధాన మంత్రి మన్‌కీ బాత్ (మనసులోని మాట) శత సందర్భం మొన్న ఆదివారం నాడు అట్టహాసంగా జరిగింది. భావోద్వేగ భాషకు, ఆవేశం ఉట్టిపడే హావభావాలకు పెట్టింది పేరైన మోడీ ఈసారి కూడా భారత ప్రజలతో తనకున్న గాఢానుబంధాన్ని వేనోళ్ల తలచుకొంటూ పరవశించిపోయారు. జనతా జనార్దన్ అంటూ వారిని కీర్తించారు. మన్‌కీ బాత్ అంటే వ్యష్టి నుంచి సమష్టి అన్నారు. నా నుంచి మనంకి ప్రయాణమన్నారు. ప్రధాని మోడీ తన వందవ మన్‌కీ బాత్‌లో మహిళా సాధికారత గురించి మాట్లాడారు. ప్రతి నెలా తాను నిర్వహించే ఈ కార్యక్రమం మహిళల సాధికారత అంశాన్ని ముందుకు తెచ్చిందన్నారు. వివిధ సామాజిక సమస్యలపై జన చైతన్యాన్ని రగిలించడానికి కారణమయ్యిందన్నారు. రేడియో ద్వారా నిర్వహిస్తున్న మన్‌కీ బాత్ స్వచ్ఛత నుంచి బేటీ బచావో, బేటీ పడావో వరకు అనేక ప్రజా ఉద్యమాలను రగిలించిందన్నారు. ప్రధాని వందవ ప్రసంగాన్ని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి వేదిక నుంచి కూడా ప్రసారం చేశారు. భారతీయ జనతా పార్టీ లక్ష్యం రెండంచుల కత్తి. మొదటి అంచు ప్రజలను వాస్తవాలకు దూరంగా భక్తి,

మత ప్రాతిపదిక జాతీయత వంటి ఆవేశ ప్రధానమైన అంశాల వైపు మళ్ళించడం. రెండో అంశం దేశాన్ని కార్పొరేట్లకు అందులోనూ తమకు బాగా ఉపయోగపడే శక్తులకు అప్పజెప్పడం.ఆవేశాన్ని రగిలించే లక్ష్యంలో భాగంగానే మన్‌కీ బాత్ ఊడిపడింది. మొట్టమొదటి మన్‌కీ బాత్ 2014 అక్టోబర్ 3 తేదీన ప్రసారమైంది. కనీసం 100 కోట్ల మందైనా ఆలకించారని, వీరు ఒక్కొక్కరూ వొక్క మన్‌కీ బాత్‌నైనా విన్నారని చెబుతున్నారు. అందుచేత ఇంతకు మించిన అత్యంత ప్రాచుర్యం గల కార్యక్రమం లేదని అంటున్నారు. యోగ నుంచి పారిశుద్ధ్యం వరకు ప్రధాని మాట్లాడని అంశం లేదు. అయితే అవన్నీ గొప్ప గొప్ప మాటలతో శ్రోతలను గాల్లో తేలించడానికి ఉద్దేశించినవే. ఆచరణలో ఏమి జరిగిందనేది శూన్యమే. ఉదాహరణకు బేటీ బచావో నినాదమే ఉంది. అది విజయవంతం కాగల కార్యక్రమంగా మారిందెప్పుడు, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు దీనిని ప్రజోద్యమంగా మార్చి దేశంలోని మహిళలను బంధ విముక్తులను చేసేలా చేయొచ్చు కదా! అది మాత్రం జరగదు. మన్‌కీ బాత్ కింద ఇంత వరకు రూ. 830 కోట్లు ఖర్చు చేసినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఇసుదాన్ గధ్వి ఆరోపించారు.

దానిని ఆల్ ఇండియా రేడియో ఖండించింది. మొత్తం ఖర్చు రూ. 8 కోట్లకు మించలేదని చెప్పింది. ఇటువంటి వివాదాలను పట్టించుకోవలసిన పని లేదు. దేశాధినేత దేశ ప్రజలతో సంబంధాలు కలిగి ఉండడాన్ని ఎంతమాత్రం ఆక్షేపించలేము. అయితే ప్రజలతో మాట్లాడినప్పుడు వారి కష్టసుఖాలు తెలుసుకోడం కనీసం వొక్క కష్టాన్నయినా తొలగించగలనని హామీ ఇచ్చి నెరవేర్చడం ప్రధాని బాధ్యత. రాచరికంలో ధర్మ గంట మోగిందంటే రాజు ప్రత్యక్షమై ప్రజల బాధలు తీర్చేవారని చెబుతారు. వంద మన్‌కీ బాత్ లలో ఒక్కటైనా ప్రజా సమస్య పరిష్కారమైందా? బెంగాల్‌కి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ ఎంపి మొహువా మొయిత్రా ఈ సందర్భంలో రెండు అంశాలు లేవనెత్తడం సమంజసంగా వుంది. బేటీ బచావో అంటున్న ప్రధాని మోడీజీ జంతర్ మంతర్‌లో ఆందోళన చేస్తున్న మహిళా రెజ్లర్స్ గురించి ఏమి చెబుతారు, హిండెన్‌బెర్గ్ బయటపెట్టిన అదానీ స్టాక్ మార్కెట్ కుంభకోణాన్ని ఏమంటారు అని ఆమె ప్రశ్నించారు. ప్రధాని మోడీ నుంచి సమాధానం వస్తుందా? దేశ సౌభాగ్యాన్ని కోరే ప్రధానులు ఇటువంటి అంశాలపై గొంతు చించుకోరు.

దేశానికి అవసరమైన ఉద్యోగాల కల్పన, చైనాను తలదన్నుతూ ఎగుమతులు పెంచుకోడం వంటి వాటి మీద దృష్టి పెడతారు. ప్రజలతో సంబంధాల పేరిట ఆచరణలో నిరూపించలేని ఉద్వేగ ప్రసంగాలు చేసి ఊదరగొట్టి మన్‌కీ బాత్ అనడం సమంజసమా? మనస్సున్న వాళ్ళెవరూ ప్రజలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనుకోరు. ప్రజలిచ్చిన ఓటు మీద అధికారం సాధించుకున్న వారు వారి మేలు కోసం తామే ప్రజాహిత రాజ్యాన్ని నడపవలసి వుండగా, ప్రైవేటుకు అప్పగించి చేతులు దులుపుకోడం వల్లనే దేశం ఇప్పటికీ ఇంత దారిద్య్రంలో కూరుకుపోయి వుంది. వాస్తవానికి ప్రజాస్వామ్యం కమ్యూనిజానికి మించిన గొప్పవరం. కాని ఆచరణలో ప్రజాస్వామ్యం పేరు చెప్పి సంపన్నుల రాజ్యాన్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికే మన్‌కీ బాత్‌లు ఉపయోగపడుతున్నాయి.

పాలకులు తమ ఆధీనంలోని ప్రచార సాధనాలను ఉపయోగించి ఇటువంటి కార్యక్రమాలను ప్రజల చెవుల్లో ఊదరగొట్టడం ద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందజూస్తున్నారు. కర్నాటకలో కీలకమైన ఎన్నికలు జరుగుతున్న వేళ మన్‌కీ బాత్ శత సందర్భాన్ని భారీ ఎత్తున నిర్వహించడంలోని దురుద్దేశాన్ని ప్రజలు గ్రహించలేరని ప్రధాని మోడీ గాని, ఆయన వంతపాడేవారు గాని అనుకుంటే అది ఆత్మద్రోహమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News