ఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆల్ ఇండియా రేడియోలో 79వ మన్ కీ బాత్ ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారత క్రీడాకారులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులు విజయంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. దీని కోసం క్రీడాకారులకు మద్దతుగా సోషల్ మీడియాలో ప్రారంభమైన ‘విక్టరీ పంచ్ క్యాంపెయిన్’ ద్వారా ప్రతిఒక్కరూ క్రీడాకారులకు మద్దతు తెలపాలని కోరారు. జులై 26న కార్గిల్ విజయ్ దివస్ అని గుర్తు చేసిన మోడీ… మన భారత సైనికుల నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలను ప్రపంచ దేశాలు చూశాయన్నారు. 1999 కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన వీర జవాన్లకు రేపు శ్రద్ధాంజలి ఘటించమని, సలాం చెయ్యమని దేశ ప్రజలను కోరారు. అలాగే కార్గిల్ విజయ గాథను చదవాలని విద్యార్థులను కోరారు.
మన్ కీ బాత్‌లో చెప్పే అంశాల్లో 75 శాతం అంశాలు 35 ఏళ్ల లోపు యువత నుంచే వస్తున్నాయనీ ఇది ఎంతో మంచి పరిణామం అని అన్నారు. అలాగే… దేశవ్యాప్తంగా ప్రజలు జీవనాధారం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తు చేశారు. శివార్లలో ఉండే గ్రామాల్లో సైతం సరికొత్త ప్రయోగాలు జరుగుతున్నాయన్నారు. మణిపూర్‌లో యాపిల్ పంటల సాగు, ఉత్తరప్రదేశ్‌లో అరటిపండ్లతో ఫైబర్ ఉత్పత్తిని మోదీ ప్రస్తావించారు. అలాగే బెర్ పండ్ల సాగు చేపట్టాలనీ, దాని ద్వారా ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పారు. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని చేనేత కార్మికుల కృషిని ప్రధాని మోడీ ప్రశంసించారు. చేనేత వస్త్రాలు కొని ప్రతిఒక్కరు వారికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 15న జాతీయ గీతాన్ని ఆలపించి రికార్డు చేయాలని ప్రధాని మోడీ కోరారు. అమృత్ మహోత్సవ్ లో భాగంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ప్రతిఒక్కరు కలిసిమెలిసి ఐక్యమత్యంగా ఉండాలని ప్రధాని మోడీ కోరారు. ఈ మేరకు అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘నేషన్ ఫస్ట్’.. ‘ఆల్వేస్ ఫస్ట్’ అనే ప్రతిజ్ఞ తీసుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.