Friday, November 15, 2024

వ్యాక్సినేషన్‌లో విజయం సాధించి మన శక్తి, సామర్థాలను చాటాం

- Advertisement -
- Advertisement -

PM Modi Mann Ki Baat with the Nation

సమిష్టి కృషితోనే అది సాధ్యమైంది
ఆరేళ్లలో పోలీస్ విభాగంలో
మహిళల సంఖ్య రెట్టింపయింది: మన్‌కీబాత్‌లో ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ద్వారా 100 కోట్ల డోసుల మైలురాయిని దాటి దేశం తన శక్తి,సామర్థాలను చాటిందని ప్రధాని మోడీ అన్నారు. సమిష్టి కృషి ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. వ్యాక్సినేషన్‌లో ఆరోగ్య కార్యకర్తలు కీలక భూమిక నిర్వహించారని ప్రధాని గుర్తు చేశారు. మొదటి డోస్ 100 శాతం పూర్తి చేసినందుకు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలను ప్రధాని అభినందించారు. ఉత్తరాఖండ్‌కు చెందిన ఆరోగ్య కార్యకర్త పూనమ్‌నౌటియాల్‌తో ప్రధాని సంభాషించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో తనకు ఎదురైన సమస్యలను ఆమె ప్రధాని దృష్టికి తెచ్చారు. ఆరేళ్లలో పోలీస్ విభాగంలో మహిళల సంఖ్య రెట్టింపయిందని ప్రధాని కొనియాడారు. ప్రతి నెలా చివరి ఆదివారంలో నిర్వహించే మనకీబాత్ రేడియో కార్యక్రమంలో భాగంగా ప్రధాని పలు అంశాలను ప్రస్తావించారు.

స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న అమృత్ మహోత్సవ్‌లో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వశాఖ దేశభక్తి గీతాలపై పోటీని ప్రకటించిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. యువత తమ కలాలకు పదును పెట్టాలని సూచించారు. డ్రోన్ల తయారీపై ప్రభుత్వ నూతన విధానం గురించి ప్రధాని ప్రస్తావించారు. డ్రోన్ల తయారీకి దేశీయంగానేగాక విదేశీ పెట్టుబడులను కూడా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఔత్సాహిక యువకులను ఆకర్షించేలా డ్రోన్ల విధానాన్ని రూపొందించామన్నారు. స్టార్టప్‌లకు ముందుకు రావాలని కోరారు. ఇప్పటికే పలు కంపెనీలు ఆసక్తి చూపాయన్నారు. దేశీయ డ్రోన్ కంపెనీలకు ఆర్మీ, నావీ, వైమానికదళం రూ.500 కోట్ల విలువైన డ్రోన్లకు ఆర్డర్ పెట్టాయని తెలిపారు. డ్రోన్ల తయారీలో మన దేశం ప్రపంచానికి నేతృత్వం వహించేస్థాయికి చేరాలని ప్రధాని ఆకాంక్షించారు.

పోలీస్ వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెరిగిందని ప్రధాని గుర్తు చేశారు. 2014తో పోలిస్తే 2020లో వారి సంఖ్య రెట్టింపయిందన్నారు. సైన్యం, పోలీస్ విభాగాలు కేవలం పురుషుల కోసమే అన్నది ఇక ఎంతో కాలం ఉండదని ప్రధాని అన్నారు. పోలీస్ పరిశోధన, అభివృద్ధి బ్యూరోలో 2014లో 1.05 లక్షలుగా ఉన్న మహిళల సంఖ్య ఇప్పుడు 2.15 లక్షలకు చేరిందని గుర్తు చేశారు. అక్టోబర్ 31న సర్దార్‌పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా ఐక్యతా సందేశాన్ని ప్రచారం చేయడంలో భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. దేశభక్తి, ఐక్యత విషయంలో పటేల్ నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News