30 నుంచి జూన్ 1 వరకు ధ్యానం
వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద కార్యక్రమం
న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం దేశం అంతటా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్యాత్మిక యాత్ర కోసం తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలోని ప్రసిద్ధ వివేకానంద రాక్ మెమోరియల్ వద్దకు ఈ నెల 30న చేరుకుంటారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే 73 ఏళ్ల ప్రధాని మోడీ తన బస సమయంలో 24 గంటల పాటు ధ్యానం చేస్తారు. రమణీయమైన వివేకానంద రాక్ మెమోరియల్ దేశం దక్షిణ కొసన కన్యాకుమారి తీరం వద్ద సముద్ర మధ్యలో తమిళ రుషి తిరువళ్లువర్ ఏకశిలా విగ్రహం సమీపంలో ఉంది.
మూడవ దఫా విజయమే లక్షంగా ఉన్న ప్రధాని మోడీ గురువారం (30) సాయంత్రం కన్యాకుమారికి వచ్చి, జూన్ 1న ఢిల్లీకి తిరిగి బయలుదేరుతారు. ఏడు విడతల లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగియనున్నది. వోట్ల లెక్కింపు 4న జరుగుతుంది. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ముందు ప్రధాని మోడీ కాషాయ దుస్తులతో కేదార్‌నాథ్ సమీపంలోని పవిత్ర గుహలో ధ్యానం చేశారు. ఆనాటి ఆయన ఫోటో బయటకు వచ్చింది కూడా. ఇది ఇలా ఉండగా, ప్రధాని మోడీ ఈ నెలలో ఎన్‌డిటివికి ఇంటర్వూ ఇస్తూ, ‘ప్రభంజనం మాకు అనుకూలంగానే ఉన్నది.
దాని గురించి నేను చెప్పవలసింది ఏమీ లేదు. మాదే పైచేయి. ప్రతి ఒక్కరికీ అది తెలుసు’ అని అన్నారు. ఎన్నికల పరాజయాలు, పలు ఫిరాయింపుల దెబ్బ తగిలిన కాంగ్రెస్ ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగంగా బిజెపిని ఢీకొంటున్నది. తన కొత్త ప్రభుత్వ తొలి 100 రోజుల కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించే బాధ్యతను తన మంత్రులకు అప్పగించారు. విజయానికి మార్గం అవకాశం, స్థాయి, వేగం, నైపుణ్యంపై దృష్టి కేంద్రీకరించడమే అని ప్రధాని మోడీ ఆ ఇంటర్వూలో చెప్పారు.