న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ ప్రతినిధి బృందం శనివారం ప్రధాని నివాసంలో ఆయనను కలుసుకుంది. పౌరత్వ సవరణ చట్టం(సిఎఎ)ను తేవడం, తమకు ఇబ్బందులు ఎదురైన పరిస్థితుల్లో తమకు అండగా నిలబడడంపై ఆయనకు కృతజ్ఞతను ఈ సందర్భంగా తెలిపింది. ఆ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికి ప్రధాని మోడీ వారు అతిథులు కారని, ఇండియా వారికి స్వప్రదేశమని అన్నారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనేక మంతి సిక్కు ప్రముఖులతో ప్రధాని తన నివాసంలో భేటీ అయ్యారు. కాగా ఇప్పుడు ఆయన ఆప్ఘనిస్థాన్ నుంచి వచ్చిన సిక్కు, హిందూ ప్రతినిధి బృందానికి తన నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. భవిష్యత్తులో కూడా వారికి నిరంతరం మద్దతునిస్తానని ప్రధాని మోడీ ఈ సందర్భంగా వారికి హామీని ఇచ్చారు. తాను కాబుల్‌ను సందర్శించినప్పుడు ఆఫ్ఘన్‌ల నుంచి లభించిన ప్రేమను కూడా ప్రధాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ భేటీ సందర్భంగా బిజెపి నాయకుడు మంజిందర్ సింగ్ సిర్సా,కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, కేంద్ర సహాయ మంత్రి మీనాక్షి లేఖి కూడా హాజరయ్యారు.
ఆఫ్ఘన్ సిక్కుహిందూ ప్రతినిధి బృందంతో ప్రధాని మోడీ భేటీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -