Monday, December 23, 2024

మోడీ మనసారా ఇస్రోహుషార్

- Advertisement -
- Advertisement -

చంద్రుడిపై ఇక శివశక్తి స్థల్
ఆగస్టు 23 జాతీయ అంతరిక్ష దినం
విదేశీ పర్యటన నుంచి నేరుగా ఇస్ట్రాక్‌కు మోడీ
సైంటిస్టులను కొనియాడుతూ భావోద్వేగం
బెంగళూరు : చంద్రయాన్ 3 కనివిని ఎరుగని రీతిలో విజయవంతం అయిన దశలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఇక్కడి ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఆనందం పంచుకున్నారు. సైంటిస్టులు, సాంకేతిక సిబ్బందిని మనసారా అభినందించి, ప్రసంగించే దశలో భావోద్వేగానికి గురయ్యారు. చంద్రుడిపై చంద్రయాన్ వ్యోమనౌక అడుగిడిన ప్రాంతాన్ని ఇక శివశక్తి స్థలిగా పిలుచుకుందామని తెలిపారు.

చంద్రయాన్ 3 విజయవంతం అయిన సుదినం ఆగస్టు 23వ తేదీని జాతీయ అంతరిక్ష దినంగా నిర్వహించుకునేందుకు నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు. దేశ శాస్త్ర సాంకేతికత, సృజనాత్మకల ఉత్సవం ఇది అని , శాశ్వతరీతిలో స్పూర్తికి బాటలు వేస్తుందని తెలిపారు. దక్షిణాఫ్రికా, గ్రీసు పర్యటనల నుంచి స్వదేశానికి వచ్చిన ప్రధాని శనివారం ఉదయం ముందుగా ఇస్రో సెంటర్‌కు వెళ్లారు. అక్కడ సిబ్బందిని ఉద్ధేశించి మాట్లాడారు. తాను జొహెన్సెస్‌బర్గ్‌లో ఉన్నా, తరువాత గ్రీస్ ఎథెన్స్‌కు వెళ్లినా తన మనసంతా ఇస్రో సాగించిన చంద్రుడి ప్రయోగం చుట్టే తిరిగిందన్నారు. ఇస్రో సాధించిన విజయంతో ప్రతి ఒక్కరు ఎగిరిగంతేసినంత పనిచేశారు.

ఇక చంద్రడిపై మన భారతీయ జెండా ఎగిరిందని తెలిపారు. దేశ సంక్షేమం బలం కలగలిపే విధంగా చంద్రుడిపై మనకు విజయం దక్కిన చోటును శివశక్తి కేంద్రంగా పిలుచుకుందామని సభికుల హర్షధ్వానాల నడుమ ప్రకటించారు. ల్యాండర్ విక్రమ్ చంద్రుడిని తాకిన ఉపరితలానికి శివశక్తి పాయింట్‌గా పేర్కొంటున్న విషయాన్ని తాను ఇక్కడి సైంటిస్టులకు, సాంకేతిక సిబ్బందికి తెలియచేస్తున్నానని వివరించారు.

దేశ అంతరిక్ష చరిత్రలోఅసాధారణ క్షణం
చంద్రయాన్ 3 విజయం భారతదేశ అంతరిక్ష పరిశోధనల రంగంలో కొత్త చరిత్రను లిఖించింది. ఇది అసాధారణ ఘట్టం అయిందన్నారు. ఇక 2019లో చంద్రయాన్ 2 విఫలమై, అక్కడి నేలను తాకిన ప్రాంతాన్ని తిరంగా పాయింట్‌గా వ్యవహరిస్తారని వివరించారు. అప్పటి ప్రయోగం విఫలం అయినా, ఇది ఇప్పటి విజయానికి అవసరం అయిన రీతిలో మనను మనం తీర్చిదిద్దుకునేలా చేసిందని తెలిపారు. ఈ క్రమంలో మన భారతీయ సైంటిస్టులు, సాంకేతిక సిబ్బంది మొక్కవోని ఆత్మవిశ్వాసం వారి ప్రతిభ మనకే కాకుండా ఈ ప్రపంచానికి మరో మారు రుజువు అయిందని తెలిపారు.

హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకూ పూదండ
భారతదేశపు ఐక్యతకు కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకూ విశిష్టమైన అనుసంధాన ప్రతీక జీవధారగా నిలుస్తుంది. శివశక్తి స్థలి ఇప్పుడు చంద్రుడిపై కూడా మనకు ఈ అనుభూతిని కల్పిస్తుందని మోడీ తెలిపారు. శివుడిలో మానవాళి సంక్షేమపు ప్రతిన ఉంది. ఇక శక్తి మన ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు జీవం పోస్తుంది. ఈ విధంగా ఇప్పుడు వెలిసే శివశక్తి స్థలి మనకు సర్వదా స్ఫూర్తిదాయకం అవుతుందని ప్రధాని తెలిపారు. రాబోయేతరాలు మరింత గురుతర బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంది. భారతీయ ప్రాచీన గ్రంధాల్లో లిఖితం అయిన ఖగోళ గుణింతాలను ఇప్పటి రాబోయే తరాలకు తెలిసేలా శాస్త్రీయంగా యువతరం రుజువు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వీటిని వినూత్నరీతిలో మరింతగా అధ్యయనం చేయాల్సి ఉందని పిలుపు నిచ్చారు.

బానిసత్వపు దశలో భారతీయ విజ్ఞానానికి సంకెళ్లు
మన చిరకాల అపార విజ్ఞానం దేశ తరతరాల బానిసత్వపు దశలో బందీ అయింది. ఇది వెలుగులోకి రాకుండా తొక్కిపెట్టారని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. మన వారసత్వాన్ని, ఇందులో ఇమిడి ఉన్న శాస్త్రీయతను విజ్ఞానాన్ని జగద్విదితం చేయాల్సి ఉంది. ఈ క్రమంలో విద్యార్థులపై ద్విగుణీకృత బాధ్యత ఉంది. మన శాస్త్రీయ విజ్ఞానాన్ని సమగ్రంగా ఆకళింపు చేసుకుంటూ , దీని ద్వారా ప్రపంచానికి మరిన్ని ఆవిష్కరణలకు స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల స్థాయి విద్యార్థులు అంతా స్పందించాల్సి ఉందన్నారు. ఇది ఆజాదీ కా అమృత్ కాల్. ఈ సమయం అపూర్వమైనది. పురాతన విజ్ఞానాన్ని వెలుగులోకి తేవాలి, ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలని పిలుపు నిచ్చారు.

సైంటిస్టులకు సెల్యూట్ కోసం ఆత్రుత చెందాను
గడిచిన రెండు మూడు రోజులుగా తనకు ఒపిక లేని పరిస్థితి ఏర్పడింది. ఎంత తొందరగా భారత్‌కు వచ్చి , చంద్రయాన్ విజయం సాధించిన సైంటిస్టులను కలిసి వారిని అభినందిద్దామా అనే ఆత్రుతతోనే గడిపానని ప్రధాని తెలిపారు. మీరు చూపిన అంకితభావం, ధైర్యం, విచక్షణ, హుందాతనం, తపన ఇవి సాధారణం కావని, వీటిని సంతరించుకున్న ఈ సైంటిస్టులకు తన సెల్యూట్ అని ప్రధాని ఈ వేదిక నుంచి తెలిపారు. ఓ వైపు గొంతు గద్గదం అవుతుండగా ఆయన జీరతో ఈ మాటలు తెలిపారు. ఇప్పుడు భారత్ చంద్రుడిపైకి చేరింది. ఈ క్రమంలో హిమాలయ సమున్నత భారత జాతీయ ఆత్మగౌరవం ఇప్పుడు చంద్రుడి తారాస్థాయికి చేరిందని ఇస్రో హాల్ చప్పట్లతో మార్మోగుతుండగా తెలిపారు.

చంద్రయాన్‌ను పరిచయం చేసిన సోమనాథ్
హెచ్‌ఎఎల్ విమానాశ్రయానికి శనివారం ఉదయం చేరుకున్న ప్రధాని మోడీకి అక్కడ జాతీయ పతాకాలు ధరించిన పలువురు స్వాగతం పలికారు. తరువాత రోడ్‌షోగా ప్రధాని ఇస్రోకు చెందిన ఇస్ట్రాక్ కార్యాలయానికి చేరారు. చంద్రయాన్ 3 పుట్టపూర్వోత్తరాలు, దీని విజయపథం గురించి అక్కడ ముందుగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సంక్షిప్తంగా తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News