న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపికైన బీహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ కుటుంబ సభ్యులను ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం కలుసుకున్నారు. కర్పూరీ ఠాకూర్ కుమారుడు, జెడియు రాజ్యసభ సభ్యుడు రాంనాథ్ ఠాకూర్ నేతృత్వంలో ఆయన కుటుంబ సభ్యులు ప్రధాని మోడీని ఆయన నివాసంలో కలుసుకున్నారు. భారత రత్న అవార్డు గ్రహీత కర్పూరీ ఠాకూర్ కుటుంబ సభ్యులను కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధాని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
సోషలిస్టు నాయకుడైన కర్పూరీ ఠాకూర్ సమాజంలోని వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేశారని, ఆయన జీవితం, ఆశయాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిని కలిగిస్తూనే ఉంటాయని ప్రధాని తెలిపారు. తన తండ్రికి దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించినందుకు తన కుటుంబం తరఫున, బీహార్ ప్రజల తరఫున, దళితులు, వెనుకబడిన వర్గాల తరఫున ప్రధానికి ధన్యవాదాలు తెలియచేసినట్లు రాంనాథ్ ఠాకూర్ తెలిపారు. జననాయక్‌గా ప్రజలు ప్రేమగా పిలిచే కర్పూరీ ఠాకూర్ బీహార్ ముఖ్యమంత్రిగా 1970 డిసెంబర్ నుంచి 1971 జూన్ వరకు, తిరిగి 1977 డిసెంబర్ నుంచి 1979 ఏప్రిల్ వరకు బాధ్యతలు నిర్వర్తించారు.