Sunday, September 8, 2024

తుపాకుల మోతలో శాంతి చర్చలు వృథా

- Advertisement -
- Advertisement -

మాస్కో: బాంబులు, తుపాకులు, తూటాల మధ్య శాంతి చర్చలు ఫలించవని, ఏ వివాదానికైనా యుద్ధ రంగంలో పరిష్కారం సాధ్యం కాదని ప్ర ధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో చెప్పారు. ఉక్రెయిన్ పోరు నేపథ్యంలో చర్చల సమయంలో పుతిన్‌కు మో డీ ఈ విషయం స్పష్టం చేశారు. భారత్ శాంతి పక్షాన ఉన్నదని. ఉక్రెయిన్‌లో పోరు అంతానికి కృషి చేయడానికి సిద్ధమేనని మోడీ టివిలో ప్రసారం చేసిన ప్రారంభోపన్యాసంలో పుతిన్‌తో చెప్పడమే కాకుండా ప్రపంచానికి ఆ మేరకు హామీ ఇచ్చారు కూడా. ‘నవతరం సముజ్వల భవితవ్యం కోసం శాంతి అత్యంత ప్రధానం& బాంబులు, తుపాకులు, తూటాల మధ్య శాంతి చర్చలు ఫలప్రదం కావు’అని మోడీ తెలిపారు. పుతిన్‌తో సోమవారం జరిపిన ఇష్టాగోష్ఠి గురించి కూడా ప్రధాని మోడీ ప్రస్తావించారు. రష్యన్ అధ్యక్షుని మాటలు ‘ఆశ’ రేపినట్లు ఆయన తెలిపారు. ‘మానవాళిపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ ప్రాణ నష్టం ఉంటే నొచ్చుకుంటారు.

అందులో కూడా అమాయక పిల్లలు హత్తులైనట్లయితే, అమాయక పిల్లలు మరణిస్తే, అది గుండెలు పిండేస్తుంది, అత్యంత బాధాకరం’అని మోడీ పేర్కొన్నారు. ఇంధన రంగంలో భారత్‌కు రష్యా సాయం గురించి కూడా ప్రధాని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రపంచం ఆహారం, ఇంధనం, ఎరువుల కొరత ఎదుర్కొంటున్నప్పుడు తాము తమ రైతులకు ఎటువంటి సమస్యా ఎదురుకానీయలేదని, రష్యాతో తమ మైత్రి అందులో పాత్ర పోషించిందని మోడీ వెల్లడించారు. ‘మా రైతుల సంక్షేమార్థం రష్యాతో మా సహకారం మరింత విస్తరించాలని అభిలషిస్తున్నాం’అని ఆయన చెప్పారు. ఉభయ దేశాల మధ్య సుదృఢ సంబంధాలు ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తాయని మోడీ అన్నారు. ఉగ్రవాదం సవాళ్లపై కూడా ప్రధాని ఆందోళన వెలిబుచ్చారు. ‘సుమారు 40 ఏళ్లుగా భారత్ ఉగ్రవాదం సవాల్‌ను ఎదుర్కొంటున్నది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తాను’అని మోడీ చెప్పారు. ప్రపంచం గడచిన ఐదు సంవత్సరాల్లో మొదట కొవిడ్ 19 కారణంగాను. ఆతరువాత వివిధ వివాదాల వల్ల అనేక సవాళ్లను ఎదుర్కొనవలసి వచ్చిందని మోడీ తెలిపారు.

రష్యన్ సైన్యంలో భారతీయ సిబ్బంది విడుదలకు రష్యా సమ్మతి
రష్యన్ సైన్యానికి అనుబంధ సిబ్బందిగా భారతీయుల నియామకాన్ని ఆపివేయాలని,సైన్యంలో ఇప్పటికీ పని చేస్తున్న వారిని తిప్పిపంపాలని భారత్ చేసిన విజ్ఞప్తికి రష్యా స్థూలంగా అంగీకరించినట్లు ఉన్నత స్థాయి ప్రతినిధులు వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సోమవారం రాత్రి జరిపిన ఇష్టాగోష్ఠిలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయం ప్రస్తావించగా భారతీయుల విడుదలకు మాస్కో అంగీకరించినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు పుతిన్‌తో 22వ భారత్, రష్యా శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు రష్యాలో రెండు రోజుల అధికార పర్యటనను మోడీ సోమవారం ప్రారంభించారు. ఉక్రెయిన్‌పై మాస్కో దురాక్రమణ ప్రారంభించిన తరువాత మోడీ రష్యాను సందర్శించడం ఇదే మొదటిసారి. రష్యన్‌సైన్యంలో భారత జాతీయులు పని చేస్తున్న అంశం ‘అత్యంత ఆందోళనకరం’ అని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ (ఎంఇఎ) క్రితం నెల ప్రకటించింది. ఆ అంశంపై మాస్కో చర్య తీసుకోవాలని ఎంఇఎ కోరింది. రష్యన్ సైన్యంలో అనుబంధ సిబ్బందిగా పని చేస్తున్న భారతీయులు అందరినీ విడుదల చేయాలన్న రష్యా నిర్ణయాన్ని మోడీ, పుతిన్ శిఖరాగ్ర చర్చల అనంతరం ప్రకటించే అవకాశం ఉన్నది.

ప్రధాని మోడీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ధన్యవాదాలు
ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం అన్వేషణకు ప్రయత్నించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం ధన్యవాదాలు తెలియజేశారు. ‘అత్యంత తీవ్ర సమస్యలు, ముఖ్యంగా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి ప్రధానంగా శాంతియుతంగా మార్గాల అన్వేషణకు మీరు ప్రయత్నించినందుకు మీకు కృతజ్ఞుడిని’ అని పుతిన్ అన్నట్లు అధికార టాస్ వార్తా సంస్థ తెలియజేసింది. క్రెమ్లిన్‌లో మోడీతో చర్చల సమయంలో పుతిన్ ఆ ప్రకటన చేసినట్లు టాస్ తెలిపింది. అంతర్జాతీయ వేదికపై రష్యా, భారత్ సన్నిహితంగా కృషి చేస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. ‘అంతర్జాతీయ వేదికపై, ముఖ్యంగా అంతర్జాతీయ సంస్థల్లో మనం సన్నిహితంగా సహకరించుకుంటున్నాం’ అని పుతిన్ చెప్పినట్లు టాస్ తెలియజేసింది. ‘యుఎన్‌లోను, షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ), బ్రిక్స్ వంటి గ్రూప్‌లలోను సహకారం సాగుతోందని ఆయన ప్రత్యేకంగా చెప్పారు.

‘సోమవారంఇష్టాగోష్ఠిగా అభిప్రాయాల వ్యక్తీకరణకు, దాదాపు అన్ని అంశాల గురించి మాట్లాడేందుకు మనకు అవకాశం కలిగింది’అని పుతిన్ తెలిపారు. మాస్కో, న్యూఢిల్లీ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తాయని తాను భావిస్తున్నట్లు కూడా పుతిన్ చెప్పారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం విస్తరణ పట్ల కూడా రష్యా అధినేత సంతృప్తి వ్యక్తం చేశారు. భారత ప్రధానిగా తిరిగి ఎన్నికైనందుకు మోడీని పుతిన్ తిరిగి అభినందించారు. అక్టోబర్‌లో రష్యన్ కజన్ నగరంలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావలసిందని మోడీని పుతిన్ ఆహ్వానించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News