Friday, November 22, 2024

సౌదీ యువరాజుతో ప్రధాని మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థిరత్వం, సంక్షేమంలో భారత్‌సౌదీ అరేబియాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకమని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. సౌదీ యువరాజు, ప్రధాని బిన్ సల్మాన్‌తో భేటీ సందర్భంగా మాట్లాడిన మోడీ, భారత్‌కు అత్యంత వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా ఒకటని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇరు దేశాలు, కొత్త అంశాలతో తమ సంబంధాలను మరింత బలోపేతం చేసుకుంటున్నాయన్నారు.

ఢిల్లీ లోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో మోడీ, మహ్మద్ బిన్ సల్మాన్‌లు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విశ్లేషణ జరిపారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ ఇరు దేశాల సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు అనేక మార్గాలను అన్వేషించాయన్నారు. ఇక సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ మాట్లాడుతూ భారత్‌లో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు. జీ20 సదస్సును నిర్వహించినందుకు భారత్‌ను అభినందిస్తున్నానని, ఈ సదస్సు వల్ల యావత్ ప్రపంచం ఎంతో ప్రయోజనం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇరు దేశాల గొప్ప భవిష్యత్తు కోసం రెండు దేశాలు కలిసి పనిచేస్తాయని అన్నారు. కాగా, భారత్‌లో మహ్మద్ బిన్ పర్యటించడం ఇది రెండవ సారి. భారత్‌కు వ్యూహాత్మక భాగస్వాముల్లో సౌదీ అరేబియా కీలక దేశంగా ఉంది. గత కొన్నేళ్లుగా తీసుకుంటున్న చర్యలతో ఇరుదేశాల సంబంధాలు ఉన్నతస్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా రక్షణ , భద్రతను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాలు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో భారత్‌సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని 2019 లో ప్రకటించారు. 2020 డిసెంబరులో అప్పటి భారత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎ నరవణె కూడా సౌదీ అరేబియాలో తొలిసారి పర్యటించారు. అనంతరం ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య రాకపోకలు సాగుతున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News