ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిసనాయకతో విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడి సహా పలు రంగాల్లో భారత్ శ్రీలంక సహకారాన్ని మరింత వృద్ధి చేయడం లక్షంగా చర్చలు జరిగాయి. శ్రీలంక అధ్యక్షునిగా సెప్టెంబర్‌లో ఎన్నికైన తరువాత దిసనాయక తన తొలి విదేశీ పర్యటనగా ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు.
చర్చలకు ముందు దిసనాయకకు రాష్ట్రపతి భవన్‌లో సాదరపూర్వక స్వాగతం లభించింది. ‘వాణిజ్యం, పెట్టుబడి, అభివృద్ధి, భద్రత సహకారంపై విస్తృత అజెండాపై చర్చించనున్నారు’ అని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ ఉభయ నేతల చర్చల ముందు ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు ఆదివారం విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తోను, ఎన్‌ఎస్‌ఎ అజిత్ దోవల్‌తోను విడిగా సమావేశం అయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా భేటీ అవుతారు.