హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని, ఇతర బిజెపి సీనియర్ నేతలను కలుసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అద్భుత విజయం నేపథ్యంలో కొత్త ప్రభుత్వాధినేతగా ప్రమాణ స్వీకారానికి ముందు సైనీ వారితో భేటీ అయ్యారు. మార్చిలో మనోహర్ లాల్ ఖట్టార్ స్థానంలో సిఎంగా బాధ్యతలు స్వీకరించిన, ఒబిసికి చెందిన సైనీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే ఆ అత్యున్నత పదవికి తమ అభ్యర్థి అవుతారని ఎన్నికల సమయంలో బిజెపి సూచించింది. ఢిల్లీలో సమావేశం అనంతరం సైనీ విలేకరులతో మాట్లాడుతూ, పార్టీ విజయానికి మోడీ విజయాలే కారణమని పేర్కొన్నారు. సైనీ కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాను, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను కూడా కలుసుకున్నారు.
ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తాయని ఎగ్జిట్ పోల్స్ సూచించినప్పటికీ తమ ప్రభుత్వ విధానాల కారణంగా బిజెపిపై జనం విశ్వాసంకనబరుస్తారని తాను ఎప్పుడూ స్పష్టం చేస్తూనే ఉన్నానని సైనీ చెప్పారు. ఇవిఎంలపై కాంగ్రెస్ అనుమానాలు లేవదీస్తుండడం గురించిన ప్రశ్నకు సైనీ సమాధానం ఇస్తూ, ప్రతిపక్షం అబడ్ధాల తుపానును సృష్టిస్తున్నదని ఆరోపించారు. ‘ఈ భారీ విజయానికి ఘనత మోడీకి దక్కుతుంది. నిరుపేదలు, రైతులు, యువజనులు, మహిళలకు లబ్ధి చేకూర్చిన పథకాలను ఆయన గడచిన పది సంవత్సరాల్లో తీసుకువచ్చారు. అవి సమాజంలోని అన్ని వర్గాలకు ఉపయుక్తం అయ్యాయి. ప్రజలు ఆయనను ప్రేమిస్తున్నారు. అందుకే బిజెపి మూడవ సారి అధికారంలోకి వస్తోంది’ అని సైనీ తెలిపారు.