Sunday, December 22, 2024

పుతిన్‌తో మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలి మాస్కో పర్యటనలో ఆయన, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య కొట్టవచ్చినట్లు కనిపించిన సౌహార్ద్రత జో బైడెన్ సారథ్యంలోని యుఎస్ ప్రభుత్వ సీనియర్ అధికారులు పలువురిని చికాకు పరచినట్లు బ్లూమ్‌బెర్డ్ నివేదిక తెలియజేసింది. తన రెండు రోజుల మాస్కో పర్యటనలో ప్రధాని మోడీ రష్యాను భారత్‌కు ‘సర్వకాల సర్వావస్థల మిత్ర దేశం’గా అభివర్ణించడమే కాకుండా తన ‘ప్రియ మిత్రుడు’ పుతిన్ పట్ల ప్రత్యేక అభిమానం ప్రదర్శించారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని మోడీ గడచిన రెండు దశాబ్దాల్లో భారత్, రష్యా మైత్రిని సమున్నత శిఖరాలకు తీసుకువెళ్లినందుకు పుతిన్‌ను కొనియాడారు. ఈ నెల 9న మొదలై 11న ముగిసిన నాటో శిఖరాగ్ర సదస్సు నడుమ ప్రధాని మోడీ రష్యా సందర్శించి, పుతిన్‌ను గాఢాలింగనం చేసుకోవడంపట్ల సీనియర్ యుఎస్ అధికారులు చికాకు పడ్డారని బ్లూమ్‌బెర్గ్ నివేదిక తెలిపింది.

ఉక్రెయిన్‌లో రష్యా దురాక్రమణ గురించిన చర్చలు బైడెన్ ప్రారంభించిన సమ్మిట్‌లో ప్రధానంగా సాగాయి. ఉక్రెయిన్ దురాక్రమణ దరిమిలా రష్యాలో ప్రధాని మోడీ తొలి పర్యటన యుఎస్, భారత్ సన్నిహిత సంబంధాల విషయమై అమెరికన్ ప్రభుత్వం లోపల, వెలుపల విమర్శలకు దారి తీసిందని యుఎస్ అధికారులు అన్నారు. ఆ పర్యటన బైడెన్ ప్రభుత్వానికి ‘సంక్లిష్టమైనది, ఇబ్బందికరమైనది’ అని యుఎస్ అధికారులు అంగీకరించినట్లు ఆ నివేదిక వెల్లడించింది. మోడీ రష్యా పర్యటన సమయం వాషింగ్టన్‌కు ‘ఇబ్బంది’ కలిగించగలదని న్యూఢిల్లీకి బైడెన్ ప్రభుత్వం తెలిపినట్లు నివేదిక పేర్కొన్నది. పర్యటన కలిగించిన అభిప్రాయం ‘దారుణమైంది’, ‘అత్యంత అనుచితమైంది’ అని అధికారులు అన్నారు. ‘నాటో సమ్మిట్ సమయంలో కాకుండా చూసేందుకు మోడీ, పుతిన్ భేటీ తేదీని వాయిదా వేయవచ్చని ఆశిస్తూ అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి కుర్ట్ క్యాంప్‌బెల్ భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో మాట్లాడారు’ అని నివేదిక తెలిపింది.

‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రకారం, మాస్కోతో న్యూఢిల్లీకి చిరకాలంగా గల సంబంధాలనే యుఎస్ గుర్తిస్తున్నదని, రష్యా, చైనా మధ్య సన్నిహిత సంబంధాలను నివారించాలని కోరుకుంటున్నదని క్వాత్రాకు క్యాంప్‌బెల్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, వాషింగ్టన్‌లో నాటో నేతలు సమీకృతమైన సమయంలో పుతిన్‌తో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు పుతిన్‌ను ఏకాకిని చేసేందుకు సాగిస్తున్న యత్నాలకు, యుఎస్, భారత్ సంబంధాల పటిష్ఠత ప్లాన్లకు విఘాతం కలిగించగలదని బైడెన్ ప్రభుత్వంలో ఆందోళన ఉన్నది. అయితే, ఈ విషయమై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఇంకా ఒక ప్రకటన జారీ చేయవలసి ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News