Wednesday, January 22, 2025

మానవీయకోణంలో దౌత్యపరమైన చర్చలు

- Advertisement -
- Advertisement -

బారి (ఇటలీ) : ఉక్రెయిన్‌లో యుద్ధం సమసిపోవడానికి, శాంతిస్థాపనకు సంప్రదింపులు, దౌత్య ప్రక్రియనే కీలకమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. జి 7 సమ్మిట్ నేపథ్యంలో శుక్రవారం ఆయన ఇక్కడ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశం అయ్యారు. రష్యా ఉక్రెయిన్ పరస్పర ఘర్షణలు చాలా కాలంగా సాగుతూ ఉండటం అంతర్జాతీయంగా
ఆందోళనకు దారితీసింది. ఈ విషయంపై మానవీయ కేంద్రీకృత దృక్పథం అవసరం అని జెలెన్‌స్కీతో మోడీ చెప్పారు. సంప్రదింపులు అవసరం, ఈ క్రమంలో సవ్యమైన రీతిలో దౌత్య నీతిని పాటించాల్సి ఉంటుందని కూడా సూచించారు. ఉక్రెయిన్‌తో భారతదేశ సంబంధాలను మరింత పటిష్టపర్చుకునేందుకు తాము ఆసక్తితో ఉన్నామని వివరించారు.

జెలెన్‌స్కీతో చర్చల దశలో మోడీ వెంట ఉన్న భారతీయ ప్రతినిధి బృందంలో విదేశాంగ మంత్రి జైశంకర్ , విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా ఉన్నారు. ఇప్పటి ఘర్షణ గురించి ఈ దశలో ప్రధాని మోడీకి జెలెన్‌స్కీ తెలియచేసినట్లు వెల్లడైంది. ఉక్రెయిన్ సంక్షోభంపై జరిగే కీలక అంతర్జాతీయ సదస్సుకు సరైన స్థాయిలో భారతదేశం కూడా హాజరవుతుందని ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. అత్యంత కీలకమని భావిస్తున్న ఈ సమ్మిట్ శని, ఆదివారాలు ( 15, 16 తేదీలలో) లూసెర్నెలోని బర్గెన్‌స్టాక్‌లో జరుగుతుంది. స్విట్జర్లాండ్ చొరవతో జరిగే ఈ సదస్సుకు ప్రధాని మోడీకి ఆహ్వానం అందింది. అయితే దీనికి భారతదేశం తరఫున సీనియర్ దౌత్యవేత్త ఒకరు వెల్లడైంది.

శాంతికి పుతిన్ షరతులు
మాస్కో : 2022లో మాస్కో చేజిక్కించుకున్న నాలుగు ప్రాంతాల నుంచి తన సేనల ఉపసంహరణను కీవ్ ప్రారంభించి, నాటోలో చేరే యోచనను విరమించుకున్న పక్షంలో ఉక్రెయిన్‌లో కాల్పుల విరమణకు ‘వెంటనే’ ఆదేశిస్తానని, సంప్రదింపులు ఆరంభిస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం వాగ్దానం చేశారు. అయితే, నాటో సైనిక కూటమిలో చేరాలని కోరుకుంటున్న కీవ్‌కు అటువంటి ఒప్పందం నచ్చకపోవచ్చు. తమ భూభాగం అంతటి నుంచి రష్యా సేనల ఉపసంహరణ జరగాలని ఉక్రెయిన్ కోరుతున్నది. కాగా, పుతిన్ ప్రతిపాదనలపై ఉక్రెయిన్ నుంచి వెంటనే ఎటువంటి స్పందనా రాలేదు. పుతిన్ మాస్కోలో రష్యన్ పార్లమెంట్‌లో ప్రసంగిస్తూ, ‘వెంటనే ఆ పని చేస్తాం’ అని చెప్పారు. ప్రముఖ పారిశ్రామిక దేశాల బృందం జి7 అధినేతలు ఇటలీలో సమావేశమైన నేపథ్యంలో పుతిన్ నుంచి ఆ వ్యాఖ్యలు వచ్చాయి.

మరొక వైపు ఉక్రెయిన్‌లో శాంతి స్థాపన దిశగా తొలి కార్యాచరణ రూపకల్పనకు ఈ వారాంతంలో మాస్కో నుంచి మినహా పలువురు ప్రపంచ దేశాల అధినేతలకు ఆతిథ్యం ఇచ్చేందుకు స్విట్జర్లాండ్ సమాయత్తం అయింది. ఉక్రెయిన్‌లో పోరును ‘స్తంభింపచేయడం కన్నా శాశ్వత పరిష్కారం’ లక్షంగా తాను ప్రతిపాదన చేశానని పుతిన్ తెలియజేశారు. ‘చరిత్రలో ఈ విషాద ఘట్టానికి స్వస్తి పలికి, రష్యా, ఉక్రెయిన్ మధ్య, విస్తారంగా యూరప్‌లో సమైక్యత పునరుద్ధరణకు క్రమంగా సాగాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని పుతిన్ తెలిపారు. రష్యా 2022లో తాను అక్రమంగా చేజిక్కించుకున్న నాలుగు ప్రాంతాల్లో దేనిలోనూ పూర్తి ఆధిపత్యం పొందలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News