Thursday, January 23, 2025

దేశంలో పోలీసు డ్రస్సుకోడ్

- Advertisement -
- Advertisement -

PM Modi moots One Nation One Police Uniform idea

ఒన్ నేషన్ ఒన్ యూనిఫాం
చింతన్ శిబిర్‌లో ప్రధాని మోడీ
నిర్బంధం కాదు ఆలోచనగా వివరణ
బలగాల సమన్వయానికి పిలుపు

న్యూఢిల్లీ : దేశంలో పోలీసులందరికి ఒకే విధమైన వస్త్రధారణ ఉండటం మంచిదని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. పోలీసు విభాగంలో ఒక దేశం ఒక యూనిఫాం పద్థతిని పాటించాలని అయితే దీనిని తాను నిర్బంధ రీతిలో ప్రవేశపెట్టాలని కోరడం లేదన్నారు. ఇది ఒక సమగ్ర ఆలోచన అన్నారు. రాష్ట్రాల హోంమంత్రులు , డిజిపిలతో హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఏర్పాటు అయిన చింతన్ శిబిరాన్ని ఉద్ధేశించి ప్రధాని మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో మాట్లాడారు. వివిధ భద్రతా బలగాల మధ్య సార్వత్రికత, అన్ని కోణాలలో సమన్వయం అవసరం అని ఈ ఒన్ నేషన్ ఒన్ యూనిఫాం కూడా ఇందులో ఓ భాగం అని తెలిపారు. ఓ పోస్టుబాక్స్ రంగును బట్టి దీని విభాగాన్ని తెలుసుకోగలమని, అదే విధంగా యూనిఫాం బట్టి పోలీసు బలగాలను గుర్తించగలగాలని కోరారు. దేశంలో వివిధ ప్రాంతాలలో పోలీసు బలగాలన్నింటికీ ఒకే విధమైన గుర్తింపు ఉండటం పరిపాలనా సౌలభ్యానికి దారితీస్తుందని , వారి ఉనికిని బట్టి వారి విధులను తెలుసుకునే విధంగా ఉండాలన్నారు. వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయం అన్ని విషయాలలో అవసరం. ప్రత్యేకించి నేరాల అదుపులో రాష్ట్రాల మధ్య సమన్వయం , సహకారం దిశలో మరింత బలీయంగా అడుగులు పడాల్సి ఉందన్నారు. దేశంలో సార్వత్రిక శాంతిభద్రతల విధానం ఉండాలనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా పిలుపును ప్రధాని సమర్థించారు. సహకార సమాఖ్యవాదం అనేది కేవలం రాజ్యాంగపరంగా ఈ భావనను సంతరించుకోవడమే కాకుండా , కార్యాచరణ కూడా అవసరం అన్నారు. ఈ విషయంలో కేంద్రం రాష్ట్రాల బాధ్యతలు గురుతరమైనవని తెలిపారు.

మేధోయుత నక్సలిజం మరీ ప్రమాదకరం
గన్స్ పేలుస్తారు..పెన్స్‌తో దెబ్బతీస్తారు
దేశంలో తీవ్రవాదం , నక్సలిజం ఏ రూపంలో ఉన్నా దీనిని నిర్మూలించేందుకు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. నక్సలిజం వివిధ రూపాలలో విస్తరించుకుని ఉంటుంది. దీనిని అరికట్టించేందుకు రాష్ట్రాల మధ్య సమన్వయం, రాష్ట్రాలు కేంద్రం మధ్య మరింత సమన్వయం సహకారం అత్యవసరం అన్నారు. నక్సల్స్ బహురూపాలలో ఉంటారు. వారు గన్స్ పట్టుకోగలరు పేల్చగలరు. పెన్ తీసుకుని తమ రాతలతో యువతను పక్కదోవ పట్టిస్తారని ప్రధాని తెలిపారు. నక్సలిజం ఏ రూపంలో ఏ కోణంలో ఉన్నా దీనిని గుర్తించి ఏరిపారేయాల్సి ఉందని డిజిపిలకు సూచించారు. యువత భావోద్వేగాలను పసికట్టి వాటిని వాడుకుని నక్సల్స్ పలు రీతులలో చేపట్టే చర్యలు దేశ సమైక్యతకు సమగ్రతలకు భంగంగా వాటిల్లుతున్నాయని ప్రధాని హెచ్చరించారు.మేధాశక్తిని సంబంధిత వనరులను వాడుకుని యువతను తీవ్రవాదం , నక్సలిజం వైపు దారిమళ్లించే శక్తులు ఇప్పటి తరాన్నే కాకుండా భావితరాలను కూడా దెబ్బతీసేందుకు వారిలో మనో విఘాతాన్ని కల్పించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని ప్రధాని హెచ్చరించారు. మన దేశంలో ఇటువంటి శక్తులు ఏ రూపంలో ఐనా తలెత్తేందుకు విస్తరించుకునేందుకు వీల్లేదు. ఇటువంటి శక్తులను మనం అంతా కలిసి ఉక్కు మనిషి సర్దార్ పటేల్ స్ఫూర్తితో వ్యవహరించి జాతీయ సమైక్యత సమగ్రతలను నిలపాల్సి ఉంటుందన్నారు. ప్రమాదకర శక్తులను సకాలంలో గుర్తించి దెబ్బతీసేందుకు మన దళాలు తగు విధంగా మేధోశక్తిని పెంపొందింపచేసుకోవాలన్నారు. నక్సల్స్ సమస్య పరిష్కారం విషయంలో రాష్ట్రాలు నిపుణులను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.

శాంతిభద్రతల అంశం రాష్ట్రాలదే ఐనా
రాజ్యాంగం ప్రకారం శాంతిభద్రతల అంశం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది. అయితే శాంతిభద్రతల విషయం ఇంతే సమానంగా దేశ సమైక్యత సమగ్రతలకు అనుసంధానం అయి ఉంది. వీటి పరిరక్షణ విషయంలో ఎటువంటి రాజీ కుదరదని ప్రధాని స్పష్టం చేశారు. అంతర్గత భద్రత అత్యంత కీలకం. ఈ విషయంలో ప్రతి రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో మంచి విషయంలో స్ఫూర్తి పొందాల్సి ఉంటుంది. ఇందులో ఎటువంటి భేషజాలకు తావు లేదన్నారు. పనితీరు ప్రాధాన్యతాంశం అవుతుంది. ఇందులో అన్ని పక్షాల మధ్య సమన్వయం అవసరం అని ప్రధాని సూచించారు. కలిసికట్టుగా రాష్ట్రాలు వ్యవహరించడం తద్వారా అంతర్గత భద్రతకు చర్యలు తీసుకోవడం రాజ్యాంగ పరమైన బాధ్యత , ఇది నిర్ధేశిత విషయం కూడా అవుతుందని ప్రధాని తెలిపారు. ఏ రాష్ట్రం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా దేశం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించమే పరమావధి అవుతుంది, అయితీరాలని స్పష్టం చేశారు.

పాతచట్టాలను తిరగేయండి
పనికిరాని పాతచట్టాలను సమీక్షించడం ద్వారా పలు ప్రయోజనాలు చేకూరుతాయి. వాటికి సవరణలు చేపట్టాలి. సమకాలీన సందర్భానికి అనుగుణంగా ఈ పాత చట్టాలను తీర్చిదిద్దాల్సి ఉంటుందని అన్నారు. దేశ శాంతి భద్రతలు, వ్యవస్థీకృత సమన్వయం అత్యంత కీలకం, ఈ దారిలో తలెత్తే పలురకాల సవాళ్లను సంబంధిత పలు సంస్థల మధ్య సరైన సమన్వయ కార్యాచరణం ద్వారా పరిష్కరించవచ్చునని, అవాంఛనీయ శక్తులు తలెత్తకుండా చేయవచ్చునని ప్రధాని తెలిపారు.

తప్పుడు వార్తలకు చెక్‌కోసం సాంకేతికత
సమాజానికి, శాంతిభద్రతలకు తప్పుడు వార్తలు , దుష్ప్రచారాలు విఘాతం అవుతాయి. ఇటువంటి వార్తల నిజాల నిర్థారణకు చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. ఈ అత్యవసర చర్యకోసం అందుబాటులో ఉండే అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా వాడుకోవల్సి ఉంటుంది. ఇంటర్నెట్ వినియోగదారులు తమకు అందే ప్రతి మెస్సెజ్‌లలోని నిజానిజాలను సరిగ్గా నిర్థారించుకుని తీరాలి. ఆ తరువాతనే వీటిని ఇతరులకు పంపించాలని కోరారు. సామాన్యుడి రక్షణకు పోలీసు , ఇంటలిజెన్స్ సంస్థల మధ్య మరింత సమన్వయం అవసరం, దీని వల్ల సముచిత సమర్థతత నెలకొంటుంది. సామాన్యుడి భద్రతకు దారితీస్తుందని తెలిపారు. రాష్ట్రాలు శాంతిభద్రతల దిశలో టెక్నాలజీని మరింతగా వాడుకోవల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన సాధనాసంపత్తిని సమకూర్చుకునే విధంగా రాష్ట్రాలు బడ్జెట్ కేటాయింపులు చేసుకోవాలి. సరరైన టెక్నాలజీని సంతరించుకోవాలని. ఇప్పుడు టెక్నాలజీ కోసం మనం పెట్టే పెట్టుబడ ఉలు భవిష్యత్తులో భద్రతకు పనికి వస్తాయని ప్రధాని రాష్ట్రాలకు సలహా ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News