Friday, December 20, 2024

వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్

- Advertisement -
- Advertisement -

 హాజరైన కేంద్ర మంత్రులు ,
ఎన్‌డిఎ నాయకులు
అంతకుముందు గంగానది,
కాలభైరవుడికి పూజలు
ప్రధాని ఆస్తుల విలువ
రూ.3.02కోట్లు చేతిలో
రూ.53వేల నగదు
అఫిడవిట్‌లో వెల్లడి

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం తన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అయోధ్యలోని రామాలయ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం నిర్ణయించిన వేద పండితులు గణేశ్వర శాస్త్రి సమక్షంలో ప్రధాని మోడీ నామినేషన్ చేశారు. ప్రధాని మోడీ అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ పండిట్ గణేశ్వర శాస్త్రితోపాటు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త బైజ్‌నాథ్ పటేల్(ఓబిసి), లాల్‌చంద్ కుషావహ(ఓబిసి), సంజయ్ సొంకర్(దళిత వర్గం) నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం ప్రాని మోడీ జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయం నుంచి బలప్రదర్శనగా బయల్దేరారు.

ఆయన వెంట పలువురు కేంద్ర మంత్రులు, ఎన్‌డిఎ నాయకులు ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఎల్‌జెపి(రాం విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, రాష్ట్రీయ లోక్ మోర్చ అధ్యక్షుడు ఉపేంద్ర కుషావహ తదితరులు ప్రధాని వెంట ఉన్నారు. నామినేషన్ వేయడానికి ముందు ప్రధాని మోడీ దశాశ్వమేథ్ ఘాట్‌లో గంగా నదికి పూజలు చేసి హారతి ఇచ్చారు. నగరంలోని కాలభైరవ ఆలయాన్ని కూడా సందర్శించి పూజలు చేశారు. అనంతరం దశాశ్వమేథ ఘాట్ వద్ద మీడియాతో మాట్లాడుతూ గంగా మాత తనను నగరానికి ఆహ్వానించినట్లు తాను భావిస్తున్నానని మోడీ చెప్పారు. స్థానిక ప్రజలు తనను బనారస్ వాస్తవ్యూడిగా(వారణాసి ఒకప్పటి పేరు బనారస్) మార్చేశారని ప్రధాని భావోద్వేగంతో అన్నారు.

కాశీ(వారణాసికి మరో పేరు)తో తన అనుబంధం విడదీయలేనిది, సరిపోల్చలేనిదని ప్రధాని అన్నారు. 2014లో తాను కాశీకి వెళ్లినపుడు తనను గంగా మాతనే ఆహ్వానించినట్లు భావించానని, అయితే పదేళ్ల తర్వాత గంగా మాత తనను తన ఒడిలోకి తీసుకున్నట్లు ఉందని ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. పదేళ్లు గడిచిపోయాయి..కాశీతో నా నఅనుబంధం మరింత బలపడింది. ఇప్పుడు ఇది నా కాశీ అని గర్వంగా చెప్పగలను. కాశీతో నా అనుబంధం తల్లీకొడుకుల బంధంగా భావిస్తున్నాను అంటూ ప్రధాని భావోద్వేగం చెందారు.

ఇది ప్రజాస్వామ్యమని, ప్రజల ఆశీస్సులు కోరుతూనే ఉంటానని ఆయన చెప్పారు. ఏదేమైనా కాశీతో తన బంధం పూర్తి భిన్నమైనదని ఆయన తెలిపారు. 2014లో మొదటిసారి ప్రధాని అభ్యర్థిగా వారణాసి నుంచి పోటీ చేసి గెలుపొందిన నరేంద్ర మోడీ ఇప్పుడు మూడవసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఏడవ దశ లోక్‌సభ ఎన్నికలలో భాగంగా జూన్ 1న వారణాసిలో పోలింగ్ జరగనున్నది. కాగా..సోమవారం రాత్రి ప్రధాని మోడీ వారణాసిలో అట్టహాసంగా రోడ్‌షో నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News