కేంద్రంలో ఎన్డీయే సర్కార్ మూడోసారి కొలువుదీరిన తర్వాత ప్రవేశ పెట్టిన పూర్తిస్థాయి బడ్జెపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఇది 140కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు. దీంతో పొదుపు , పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పద్దు దేశాన్ని వికసిత్ భారత్‌వైపు అడుగులు వేయిస్తుందని పేర్కొన్నారు. “ భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్. అనేక రంగాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నాం. బడ్జెట్‌లు సాధారణంగా ఖజానాను పెంచేందుకు ఉద్దేశించింది. ఈ బడ్జెట్‌లో రూ. 12 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు.
అన్ని ఆదాయ వర్గాలకు పన్నులను తగ్గించారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరం” అని ప్రధాని పేర్కొన్నారు. అణు ఇంధన రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు తలుపులు తెరవడం వంటి చర్యలు ఈ బడ్జెట్‌లో తీసుకు వచ్చిన గొప్ప సంస్కరణలు అన్నారు.ఉద్యోగాల కల్పన రంగాలన్నిటికీ బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించడమైందని చెప్పారు. కీలకమైన సంస్కరణలను ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలో భారీ నౌకల నిర్మాణం చేపట్టడానికి వీలుగా తగిన మౌలిక సదుపాయాలు కల్పించడం ఆత్మనిర్బర్ భారత్ లక్షానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. వికాస్‌భీ, విరాసత్‌భీ అనే మంత్రంతో దేశం పురోగతి చెందుతోందన్నారు. వ్యవసాయ రంగంలో విపలవాత్మకమైన మార్పులు తీసుకురాడానికి వీలుగా వంద జిల్లాల్లో పిఎం ధన్‌ధాన్యకృషి యోజన పథకం కింద నీటిపారుదల, మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చేయనున్నట్టు వివరించారు.