న్యూఢిల్లీ: మహిళలపై నేరాల కేసుల్లో సత్వర న్యా యం అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉద్ఘాటించారు. అది మహిళలకు వారి భద్రతపై మరింత భరోసా ఇస్తుందని ప్రధాని సూచించారు. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సమక్షంలో జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ మహాసభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, దేశ ప్రజలు సుప్రీం కోర్టుపై గాని, న్యాయవ్యవప్థ పై గాని ఎన్నడూ అపనమ్మకం వ్యక్తం చేయలేదని స్పష్టం చేశారు. ఆత్యయిక స్థితిని ‘చీకటి’ కాలం గా ప్రధాని అభివర్ణిస్తూ, ప్రాథమిక హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ కీలక పాత్ర పోషించిందని తెలియజేశారు. జాతీయ భద్రత వ్యవహారాల గు రించి మోడీ ప్రస్తావిస్తూ,
జాతీయ ప్రయోజనాలకే అగ్ర ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా న్యాయవ్యవస్థ జాతీయ సమగ్రతను పరిరక్షించిందని చెప్పారు. కోల్‌కతాలో ఒక డాక్టర్‌పై హత్యాచారం, ఠాణెలో ఇద్దరు కిండర్‌గార్టెన్ బాలికలపై లైంగిక దాడి ఆరోపణల నేపథ్యంలో మోడీ మాట్లాడుతూ, మ హిళలపై అత్యాచారాలు, పిల్లల భద్రత సమాజానికి అమిత ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ‘మహిళలపై అత్యాచారాల కేసుల్లో ఎంత త్వరగా న్యాయం జరుగుతుందోసగం జనాభాకు వారి భద్రత గురించి మరింత భరోసా దక్కుతుంది’ అ ని ప్రధాని అన్నారు. మహిళలపై నేరాల కట్టడికి సంబంధించి అనేక కఠిన చట్టాలు ఉన్నాయని, సత్వర న్యాయం సాధనకు క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ మధ్య మెరుగైన సమన్వయం ఉండడం అవశ్యమని మోడీ చెప్పారు.
చట్టబద్ధ పాలనకు జిల్లా న్యాయవ్యవస్థ కీలకం :సిజెఐ
‘న్యాయవ్యవస్థకు వెన్నెముక’ జిల్లా న్యాయవ్యవస్థ అని, అందువల్ల అది చట్టబద్ధ పాలనలో కీలక భాగం అయిందని భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) డివై చంద్రచూడ్ శనివారం చెప్పారు. జిల్లా న్యాయవ్యవస్థను సబార్డినేట్‌గా పిలవడం మానాలని ఆయన కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా అధిక సంఖ్యలో మహిళలు జిల్లా న్యాయవ్యవస్థలో చేరుతుండడాన్ని చంద్రచూడ్ ప్రస్తావిస్తూ, న్యాయమూర్తులు ప్రొఫెషనల్స్ అయినప్పటికీ వాస్తవ పరిస్థితుల ప్రభావానికి గురవుతుంటారని, తత్ఫలితంగా వారి మానసిక ఆరోగ్యం దెబ్బ తినవచ్చునని అన్నారు. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన ‘జిల్లా న్యాయవ్యవస్థ జాతీయ మహాసభ’లో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగిస్తూ, న్యాయం అన్వేషణలో పౌరుడు ముందుగా సంప్రదించేది జిల్లా న్యాయవ్యవస్థనే అని చెప్పారు. ‘జిల్లా న్యాయవ్యవస్థ చట్టబద్ధ పాలనలో కీలక అంతర్భాగం’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఎన్‌జెడిజి(జాతీయ జ్యుడీషియల్ డేటా గ్రిడ్)లోనిడేటా వెల్లడించే మౌలిక వాస్తవం ఏమంటే జిల్లా న్యాయవ్యవస్థ పౌరులకు మొదటి సంప్రదింపుల స్థానమే కాకుండా చివరిది కూడా అని ఆయన చెప్పారు.
అందుకు కారణాలు అనేకం ఉండవచ్చునని, అనేక మంది పౌరులు లీగల్ ప్రాతినిధ్యాన్ని భరించలేకపోతున్నారని, వారికి చట్టబద్ధమైన హక్కులపై అవగాహన లేదని, భౌతికంగా కోర్టులను ఆశ్రయించడంలో భౌగోళిక ఇబ్బందులు ఉన్నాయని సిజెఐ వివరించారు. ‘మన పని నాణ్యత, పౌరులకు మనం న్యాయం అందజేసే పరిస్థితులు మనపై వారికి నమ్మకం ఉందా అనేది నిర్ధారిస్తాయి. అది సమాజం పట్ల మన సొంత జవాబుదారీ తనానికి ఒక పరీక్ష కూడా’ అని ఆయన అన్నారు, ‘అందుకే జిల్లా న్యాయవ్యవస్థకు బృహత్తర బాధ్యత మోయాలని పిలుపు ఇస్తున్నది. దానిని సముచితంగానే ‘న్యాయవ్యవస్థక వెన్నెముక’గా అభివర్ణిస్తున్నారు’ అని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ వెన్నెముకను కాపాడడానికి జిల్లా న్యాయవ్యవస్థను ‘సబార్జినేట్ జ్యుడీషియరీ’గా పిలవడం ఆపివేయాలని ఆయన కోరారు. సిజెఐ, మోడీతో పాటు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సుప్రీం కోర్టు న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కపిల్ సిబల్, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా కూడా సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. రెండు రోజుల మహాసభను సుప్రీం కోర్టు నిర్వహించింది.