Saturday, November 16, 2024

రానున్న పదేళ్ళలో రికార్డు స్థాయిలో కొత్త వైద్యులు : మోడీ

- Advertisement -
- Advertisement -

Modi on doctors

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల పథకం వల్ల రానున్న పదేళ్లలో రికార్డు స్థాయిలో నూతన వైద్యులు రాబోతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. అందరికీ వైద్య విద్య అందుబాటులో ఉండేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. గుజరాత్‌లోని భుజ్ జిల్లాలో కెకె పటేల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రారంభించారు.

ఈ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా ఏర్పాటైన సభను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ, దేశంలోని ప్రతి జిల్లాలోనూ ఓ వైద్య కళాశాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి జరుగుతోందన్నారు. వీటి వల్ల రానున్న పదేళ్ళలో మన దేశంలో కొత్తగా రికార్డు సంఖ్యలో డాక్టర్లు రాబోతున్నారని చెప్పారు. భుజ్‌ జిల్లాలో ప్రారంభమైన ఈ ఆసుపత్రి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటు ధరలకు అందజేస్తుందన్నారు.

రెండు దశాబ్దాల క్రితం గుజరాత్‌లో కేవలం తొమ్మిది వైద్య కళాశాలలు, 1,100 సీట్లు మాత్రమే ఉండేవన్నారు. నేడు 36 వైద్య కళాశాలలు, 6,000 సీట్లు ఉన్నాయన్నారు. మెరుగైన ఆరోగ్య సదుపాయాలంటే కేవలం వ్యాధులకు చికిత్స మాత్రమే కాదని, సామాజిక న్యాయం కూడా జరగాలని అన్నారు. ఓ నిరుపేద వ్యక్తికి చౌకగా, ఉత్తమ చికిత్స అందితే, ఈ వ్యవస్థపై ఆయన నమ్మకం బలపడుతుందన్నారు.

శ్రీ కచ్చి లేవ పటేల్ సమాజ్ ఆధ్వర్యంలో కెకె పటేల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించారు. కచ్‌లో మొదటి చారిటబుల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇదే. దీనిలో 200 పడకలు ఉన్నాయి. దీనిలో ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ (క్యాత్‌ల్యాబ్), కార్డియోథొరాసిక్ సర్జరీ, రేడియేషన్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, న్యూక్లియర్ మెడిసిన్, న్యూరో సర్జరీ, కీళ్ళ మార్పిడి, ఇతర సేవలు అందుబాటులో ఉంటాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News