పూర్వపు ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి భారీ నష్టం అని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అభివర్ణించారు. ప్రజలు, దేశం అభివృద్ధి పట్ల ఆయన నిబద్ధత సదా గౌరవనీయం అని మోడీ ఉద్ఘాటించారు. దేశ విభజన దరిమిలా సర్వం వదలి వేసి భారత్‌కు ఆయన కుటుంబం వలస వచ్చిన పిదప మన్మోహన్ జీవన ప్రస్థానాన్ని మోడీ ఒక వీడియో సందేశంలో గుర్తు చేసుకున్నారు. అప్పటి నుంచి ఆయన సాధించిన విజయాలు అల్పమైనవి ఏమీ కాదని మోడీ అన్నారు. మన్మోహన్ జీవితం భావి తరాలకు ఎల్లప్పుడూ ఒక పాఠం అవుతాయని, ఎవరైనా సర్వం కోల్పోయిన తరువాత సమున్నత విజయాల సాధనకు ఎంతగా కష్టపడతారో ఆయన జీవితం సూచిస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 92వ ఏట గురువారం కన్ను మూసిన మన్మోహన్ సింగ్ వినమ్ర మనిషిగా, పండితునిగా, ఆర్థికవేత్తగా, సంస్కరణలకు అంకితమైన నేతగా ఎల్లప్పుడు గుర్తు ఉంటారని మోడీ తెలిపారు.
ప్రభుత్వంలో ఆయన వివిధ హోదాల్లో సేవలు అందించారని ప్రధాని మోడీ పేర్కొంటూ, సవాళ్ల సమయంలో ఆయన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) గవర్నర్ అని, పివి నరసింహారావు సారథ్యంలోని ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా దేశాన్ని కొత్త ఆర్థిక పథంలో నడిపించారని తెలియజేశారు. ‘ప్రధానిగా దేశ అభివృద్ధికి, పురోగతికి ఆయన కృషి సదా స్మరణీయం’ అని మోడీ పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రతిష్ఠాకర విద్యా సంస్థల్లో చదివి, ప్రముఖ పదవులు అధిష్ఠించినప్పటికీ మాజీ ప్రధాని. కాంగ్రెస్ నేత తన సాధారణ నేపథ్యం విలువలను ఎన్నడూ మరచిపోలేదని మోడీ తెలిపారు. ఆయన వినమ్రత, సంయమనం, మేధోశక్తి విశిష్ట పార్లమెంటరీ వేత్తగా ఆయన జీవితాన్ని తీర్చిదిద్దాయని మోడీ పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్యం బాగుండక పోయినప్పటికీ వీల్ చైర్‌లో పార్లమెంట్‌కు రావడం ద్వారా మన్మోహన్ సింగ్ ఎంపిగా తన కర్తవ్యం నిర్వహణ పట్ల చూపిన అంకితభావాన్ని మోడీ శ్లాఘించారు.
అందరికీ అందుబాటులో ఉండేందుకు మన్మోహన్ సింగ్ పాక్షిక రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారని ఆయన తెలియజేశారు. మన్మోహన్ సింగ్ 200414 కాలంలో ప్రధానిగాను. తాను గుజరాత్ ముఖ్యమంత్రిగాను ఉన్నప్పుడు పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై తాను తరచు ఆయనతోచర్చించేవాడినని మోడీ గుర్తు చేసుకున్నారు. 2014లో మన్మోహన్ సింగ్ ప్రధాని అయినప్పుడు తాను ఆయనతో మాట్లాడినట్లు మోడీ తెలియజేశారు. మన్మోహన్ సింగ్ జన్మదినం రోజు తాము మాట్లాడుకున్నామని మోడీ తెలిపారు.