పహల్గాం కుట్రదారులకు కఠిన
శిక్ష తప్పదు బాధితులకు
న్యాయం జరుగుతుంది
కశ్మీర్‌లో అభివృద్ధిని చూసి
శత్రువుల కుట్రలు ‘మన్ కీ
బాత్’లో ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ : పహల్‌గామ్ ఉగ్ర దాడి బాధితులకు క చ్చితంగా న్యాయం జరుగుతుందని ప్రధాని నరేం ద్ర మోడీ ఆదివారం ఉద్ఘాటించారు. పహల్‌గామ్ లో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడిని ప్రధాని తీవ్రంగా ఖండించారు. 26 మంది పౌరుల వధ వెనుక ఉన్న ఉగ్రవాదులు, కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష తప్పదని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ తన నెలవారీ కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 121వ ఎపిసోడ్‌లో మాట్లాడుతూ, ఉగ్రదాడి చిత్రాలను చూస్తుంటే ప్రతి భారతీయుని రక్తం మరిగిపోతోందని చెప్పారు. దేశ సమైక్యత, 140 కోట్ల జనాభా సంఘీభావం ఉగ్రవాదంపై ఈ పోరులో అతి పెద్ద బలం అని మోడీ చెప్పారు. ‘ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరుకు ఆధారం ఈ సమైక్యతే. ఈ సవాల్‌ను ఎదుర్కొనడానికి మన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి. ఒక దేశంగా మన బలమైన సంకల్ప శక్తిని ప్రదర్శించాలి. ఈ ఉగ్ర దాడి తరువాత యావత్ దేశం ఒకే గొంతుకతో మాట్లాడుతున్న విషయాన్ని నేడు ప్రపంచం గమనిస్తోంది’ అని ఆయన తెలిపారు. ఈ నెల 22న పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్ర దాడి ప్రతి భారతీయుడినీ కలచివేసిందని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ‘మీతో నా మనసులోని మాట ను పంచుకుంటున్న వేళ నా హృదయం తీవ్ర వేదనతో నిండి ఉంది.
పహల్‌గామ్ ఉగ్ర వాడి ప్రతి పౌరుని హృదయాన్ని గాయపరచింది. బాధితుల కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడూ తీవ్ర సానుభూతి వ్యక్తం చేస్తున్నాడు. ఏ రాష్ట్రానికి చెందినవారైనా, ఏ భాష మాట్లాడేవారైనా ఈ దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారి బాధను అనుభవిస్తున్నారు’ అని మోడీ తెలిపారు. ‘ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారి నిరాశకు, పిరికితనానికి పహల్‌గామ్ దాడి అద్దం పడుతోంది’ అని ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్‌లో శాంతియుత వాతావరణం నెలకొంటున్న తరుణంలో, పాఠశాలలు, కళాశాలలు తిరిగి కళకళలాడుతున్న వేళ, అభివృద్ధి పనులు ఊపు అందుకున్న సమయంలో, ప్రజాస్వామ్యం బటపడుతున్నప్పుడు, పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతున్నప్పుడు, యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నప్పుడు& దేశ శత్రువులకు ఇది అంతా నచ్చలేదని ప్రధాని విమర్శించారు. ‘కాశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు, వారి యజమానులు ఇంత పెద్ద కుట్ర పన్నారు’ అని మోడీ ఆరోపించారు. ఈ దాడి ఘటనపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్న సంతాప సందేశాలను ప్రధాని ప్రస్తావించారు.
‘భారతీయులమైన మనం అనుభవిస్తున్న ఆగ్రహాన్నే యావత్ ప్రపంచమూ అనుభవిస్తోంది. ఉగ్ర దాడి తరువాత ప్రపంచవ్యాప్తంగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ నాయకుల నుంచి నాకు ఫోన్ కాల్స్, సందేశాలు అందాయి. వారంతా ఘోరమై న ఈ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రాణా లు కోల్పోయినవారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో 140 కోట్ల మంది భారతీయులతో యావత్ ప్రపంచం నిలుస్తోంది’ అని మోడీ వివరించారు. ‘బాధిత కు టుంబాలకు నేను మరొకసారి హామీ ఇస్తున్నాను. మీకు న్యాయం జరుగుతుంది. కచ్చితంగా న్యాయం జరుగుతుంది.ఈ దాడికి పాల్పడినవారు, కుట్రదారులు అత్యంత కఠిన ప్రతిస్పందనను ఎదుర్కొనవలసి ఉంటుంది’ అని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.