న్యూఢిల్లీ: రాజకీయాల్లో ఏకాభిప్రాయం అనే అంశాన్ని భారతీయ జనతా పార్టీ గౌరవిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఢిల్లీలో జరిగిన జన్ సంఘ్ నేత దీనదయాల్ ఉపధ్యాయ వర్ధంతి కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోడీ బిజెపి ఎంపిలను ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆయన సిద్ధాంతమైన అంత్యోదయ అంతర్గత మానవత్వమే స్ఫూర్తి అని ఆయన తెలిపారు. రాజకీయ అంటరానితనాన్ని బిజెపి విశ్వసించబోదని స్పష్టం చేశారు. దేశంలో అనేక కఠిననిర్ణయాలు అన్ని పార్టీలతో చర్చించి తీసుకున్నామని మోడీ వెల్లడించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాజకీయ ప్రత్యర్థి అయిన ఆయనకు భారతరత్న పురస్కారం ఇచ్చి గౌరవించినట్టు నరేంద్ర మోడీ గుర్తు చేశారు. పలువురు ఇతర కాంగ్రెస్ నేతలకు కూడా పురస్కారాలు అందజేసినట్టు తెలిపారు. రాజకీయాలకంటే దేశహితమే తమ తొలి ప్రాధాన్యమని ప్రధాని పేర్కొన్నారు. తాము పాటించే సిద్ధాంతం దేశమే తొలి ప్రాధాన్యం అని చెబుతుందని, ఆ సిద్ధాంతం రాజకీయ పాఠాలను దేశనీతి అనే భాషలో బోధిస్తుందని ప్రధాని అన్నారు. ”బిజెపి సిద్ధాంతం సబ్ కా సాథ్, సభ్ కా వికాస్, సభ్ కా విశ్వాస్ అని చెబుతుందనేందుకు మాకు గర్వంగా ఉంది”. అని ప్రధాని పేర్కొన్నారు.
PM Modi paid tribute to Deendayal Upadhyaya