Monday, December 23, 2024

భారత్‌కు ఆటంకాల ‘ఇండియా’ క్విట్‌ఇండియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జాతీయ చేనేత దినోత్సవం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రతిపక్ష కూటమి ఇండియాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అవినీతి బంధుప్రీతిల కాలం చెల్లిందని, ఈ రెండూ ఇక క్విట్ ఇండియానే అని స్పష్టం చేశారు. స్థానిక ప్రగతిమైదాన్‌లోని భారత్ మండపంలో జాతీయ చేనేత దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ఇప్పుడు ఇండియాగా అవతరించిన ప్రతిపక్ష కూటమిని ఉద్ధేశించి ప్రధాని స్పందిస్తూ ఈ జట్టు దేశం అభివృద్ధి చెందిన దేశం కావడానికి అడ్డంకిగా మారుతోందని విమర్శించారు. మంగళవారం లోక్‌సభలో తమ ప్రభుత్వంపై ఇండియా తరఫున అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తున్న దశలో వీరిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఘాటుగా స్పందించారు. క్విట్ ఇండియా ఉద్యమం ఈ నెలలోనే ఈ రోజుల్లోనే అప్పట్లో నినాదమై తరువాత ఉద్యమమై దేశ స్వాతంత్య్రానికి దారితీసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితోనే తిరిగి ఓసారి తాము ప్రజల మందుకు అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపురాజకీయాల పార్టీలపై క్విట్‌ఇండియాకు పిలుపు వెలువరిస్తున్నట్లు తెలిపారు.

ఈ దేశం భారత్ , ఇది భారతదేశం అని పేర్కొన్న ప్రధాని ఇండియా కూటమి ఇప్పుడు దేశానికి పెను ముప్పుగా దాపురించిందని విమర్శించారు. భారతదేశానికి చేనేత, ఖాదీ, జవుళి రంగాలు అత్యంత కీలకమైనవని, ప్రత్యేకించి టెక్స్‌టైల్స్ రంగంలో భారత్ ప్రపంచ నాయక పాత్రలో ఉందన్నారు. దీనిని గుర్తించే తమ ప్రభుత్వం పలు స్థాయిలలో చేనేతలు, హాండ్లూమ్స్ రంగానికి పలు రకాలుగా సాయం అందిస్తోందన్నారు. లోకల్‌కు సముచిత ప్రాధాన్యతనే తమ ప్రభుత్వ లక్షం అని , ఈ వోకల్ ఫర్ లోకల్ నినాదం ఇప్పుడు ప్రజా ఉద్యమం అవుతోందన్నారు. త్వరలోనే భారత్‌ను 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక మహాశక్తిగా రూపొందించాలనేదే తమ లక్షం అని, ఈ ప్రక్రియలో జవుళి రంగం, ఫ్యాషన్ పరిశ్రమకు విశేష స్థానం ఉందని, ఇవి తమ కార్యకలాపాలను తగు విధంగా విస్తరించుకోవల్సి ఉందన్నారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన నియో మిడిల్ క్లాసుతో జవుళిరంగానికి పలు నూతన అవకాశాలు వచ్చివాలాయని వివరించారు. స్వదేశీ ఇప్పుడు నయా విప్లవం అయిందని తెలిపారు.

పండుగల వేళ దండిగా దేశీయ పండుగ
ఇప్పుడు దేశంలో పండుగల కాలం ఆరంభం అవుతోంది. ముందు సోదరసోదరీ బంధంతో రక్షాబంధన్, తరువాత అవిఘ్నమస్తుగా గణేష్ చతుర్థి, తరువాత విజయాల దసరా ఉత్సవాలు, ఆ తరువాత చెడుపై మంచి గెలుపు వేడుకల దీపావళి ఈ విధంగా పలు పండుగలు వస్తున్నాయని ప్రధాని గుర్తు చేశారు. ఈ పర్వదినాలలో మన మంతా స్వదేశీని మంత్రంగా పాటించాల్సి ఉంది. దేశీయ ఉత్పత్తులను ఆదరించాలి. ఖాదీనే ధరించాలని, ఇక్కడ ఉత్పత్తి అయిన పలు రకాల సరుకులను వాడకాల ద్వారా ప్రోత్సహించాలని పిలుపు నిచ్చారు. స్వదేశీకి ఇది నిజంగానే ముఖ్యమైన పండుగ అవుతుందన్నారు. ఆగస్టు 9వ తేదీన అప్పట్లో మహాత్మా గాంధీ పిలుపుతో క్విట్ ఇండియా ఉద్యమం వెల్లువెత్తిందని గుర్తు చేశారు.

ఇప్పుడు ఈ దశలో మనకు బాగా వర్తించే పూర్తి స్థాయిలో అన్వయించుకునే విషయం అయిందని తెలిపారు. క్విట్ ఇండియా సందేశాన్ని తిరిగి మనం అందుకోవాల్సి ఉందన్నారు. ఓ వైపు వికసిత్ భారత్ లేదా ప్రగతియుత భారత్ దిశలో సంకల్పం జరగగా, దీనికి అడ్డంకులను సృష్టించే శక్తులను తరిమికొట్టేందుకు మన మంతా తిరిగి క్విట్ ఇండియా స్ఫూర్తితో సాగాల్సి ఉందన్నారు. ఆటంకాల ముళ్లను ఏరివేసేందుకు తిరిగి ఉద్యమ స్పూర్తితో సాగాల్సి ఉందన్నారు. అవినీతి, బంధుప్రీతి, మచ్చికల తంతులు ఇక క్విట్ ఇండియా కావాల్సిందే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News