న్యూఢిల్లీ : దేశంలోని సమాజంలోని ప్రతి దుష్టశక్తిపై దేశభక్తిని సంఘటిత ఆయుధంగా చేసుకుని సాధించే విజయమే విజయదశమి అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. విజయదశమి దసరా నేపథ్యంలో ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 10లోని రామ్‌లీలా మైదానంలో మంగళవారం జరిగిన రావణ్ దహన్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ వేడుకకు వేలాదిగా జనం తరలివచ్చారు. జనసందోహాన్ని ఉద్ధేశించి ప్రధాని మాట్లాడారు. రావణుడిపై రాముడు విజయం సాధించిన రోజు విజయదశమి అయింది.
శతాబ్దాల నిరీక్షణ తరువాత అయోధ్యలో రామమందిర నిర్మాణం ప్రతి ఒక్కరికి ఆనందదాయకం అయిందని ప్రధాని తెలిపారు. ఇన్నేళ్ల తరువాత, ఇంతటి ప్రజా సహనం అనంతరం రామమందిరం ప్రజల సందర్శనకు తెరుచుకుంటుందని, ఇది అత్యద్భుత ఘట్టం అవుతుందని తెలిపిన ప్రధాని భారతదేశం ఇతరులపై దాడులకు ఆయుధాలను వాడదని, కేవలం ఆత్మరక్షణకు ఆయుధాలు వాడుతుందని తెలిపిన ప్రధాని విశిష్ట రీతిలో దేశ ప్రజలు తరాల నుంచి ఆయుధ పూజాదికాలు నిర్వహించేది కేవలం దుష్టశిక్షణకు అని స్పష్టం చేశారు.
ఇదే వారసత్వంగా వస్తోందన్నారు. ఈ విజయదశమిలోని దశ నేపథ్యంలో అంతా ఈ క్షణంలో పది ప్రతిజ్ఞలు వహించాలని పిలుపు నిచ్చారు. నీటి ఆదా, డిజిటల్ లావాదేవీలు, స్వచ్ఛత, స్థానిక వస్తువులకు ప్రాధాన్యత, పనిలో నాణ్యత, దేశీయ పర్యాటకం, ప్రకృతి పర్యాటకం, తృణధాన్యాల వినియోగం, ఫిట్‌నెస్‌ల పరిరక్షణకు అంతా ప్రతిన తీసుకోవల్సి ఉందని పిలుపునిచ్చారు. ఈ దసరా ఉత్సవాలు పలు శుభ పరిణామాల నడుమ సాగుతున్నాయని తెలిపిన ప్రధాని ఈ సందర్భంగా చంద్రయాన్ 3 విజయవంతం, పార్లమెంట్ కొత్తభవనం , ఇటీవలి మహిళా బిల్లు ఆమోదం వంటివి కీలక అంశాలని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ ఓ పేద కుటుంబం స్థితిగతిని బాగుపర్చడానికి తమవంతుగా పాటుపడాలని కూడా ప్రధాని పిలుపు నిచ్చారు.