న్యూఢిల్లీ: దక్షిణాసియా రాజకీయ చిత్రపటం పునర్లిఖించడానికి దారితీసిన 1971 నాటి అమరవీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఘన నివాళులు అర్పించారు. లక్షలాది మంది బంగ్లాదేశీ ప్రజలపై పాకిస్తానీ సైన్యం పాల్పడిన అత్యంత భయానక హింసకు ఈ యుద్ధం ముగింపు పలికింది. 1971 డిసెంబర్ 16న 90,000 మందికి పైగా పాకిస్తానీ సైనికులు లొంగిపోవడంతో స్వతంద్ర దేశంగా బంగ్లాదేశ్ అవతరణకు మార్గం సుగమమైంది. డిసెంబర్ 16వ తేదీని భారత్ విజయ్ దివస్‌గా జరుపుకుంటోంది. అమరులైన భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోడీ ఘన నివాళులు అర్పిస్తూ వారి త్యాగాలు, మొక్కవోని స్ఫూర్తి భారతదేశ చరిత్రలో ఎల్లకాలం నిలిచి ఉంటాయని సమాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మోడీ పేర్కొన్నారు. 1971లో భారత్‌కు విజయాన్ని చేకూర్చిన యుద్ధంలో అసమానధైర్యసాహసాలు ప్రదర్శించిన సైనికులందరికీ విజయ్ దివస్ నాడు దేశం హృదయపూర్వక నివాళులు అర్పిస్తోందని, వారి ధైర్య సాహసాలు దేశానికి నిరంతరం స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు.
1971 నాటి యుద్ధంలో మనసాయుధ దళాలు చేసిన నిస్వార్థ త్యాగాలను దేశం స్మరించుకుంటూ కృతజ్ఞతలు తెలియచేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. అసమాన శౌర్యాన్ని ప్రదర్శించి చారిత్రాత్మక విజయాన్ని సాధించిన అమరసైనికులకు విజయ్ దివస్ సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. 1971 యుద్ధంలో ధైర్యసాహసాలను ప్రదర్శించిన సాయుధ సిబ్బందికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాళులర్పించారు. ప్రతి సందర్భంలో అత్యంత ధైర్యంతో దేశాన్ని కాపాడుతున్న సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నామని ఆయన తెలిపారు. వారి త్యాగాలు, సేవలు చిరకాలం మన హృదయాలలో నిలచి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. విజయ్‌దివస్ సందర్భంగా జాతీయ యుద్ధ స్మారకం వద్ద పుష్ప గుచ్ఛాలు ఉంచి అమర జవాన్లకు ఆయన నివాళులర్పించారు.రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, సైనిక దళాల ప్రధానాధికారి మనోజ్ పాండే, నౌకాదళ ప్రధానాధికారి అడ్మిరల్ హరి కుమార్, రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమనె, వైమానిక దళ ఉప ప్రధానాధికారి ఎయిర్ మార్షల్ ఎపి సింగ్ కూడా అమర జవాన్లకు నివాళులర్పించారు.