ప్రముఖ తెలుగు నటుడు, దాత అక్కినేని నాగేశ్వరరావు (ఎఎన్‌ఆర్) భారతీయ చిత్రసీమకు చేసిన అపారమైన సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఘనంగా స్మరించుకున్నారు. పార్లమెంట్ హౌస్‌లో జరిగిన సమావేశంలో, ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగార్జున ప్రధాని మోడికి ‘మహాన్ అభినేత అక్కినేని క విరాట్ వ్యక్తిత్వం’ అనే పుస్తకాన్ని అందజేశారు. ఎఎన్‌ఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని రచించబడిన ఈ పుస్తకాన్ని పద్మభూషణ్ అవార్డు గ్రహీత, మాజీ ఎంపి ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రచించారు.
ఈ పుస్తకం ఎఎన్‌ఆర్ యొక్క సినీ ప్రస్థానం, సమా జానికి అందించిన సేవలు, ఆయన ప్రభావాన్ని వివరిస్తుంది. ఎఎన్‌ఆర్ సినీ రంగంలో ఏడు దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ తెలుగు చిత్రసీమను తీర్చిదిద్దడంలో ఆయన కీలకపాత్ర పోషించారని ప్రశంసించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన సినిమాల ద్వారా ప్రతిబింబించడంలో ఎఎన్‌ఆర్ విశేషంగా రాణించారని పేర్కొన్నారు. చెన్నై నుంచి హైదరాబాద్‌కి తెలుగు చిత్రపరిశ్రమను మార్చడంలో ఆయన తీసుకున్న దృఢమైన నిర్ణయం, నేడు హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా నిలిపిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు.
ఎఎన్‌ఆర్ కేవలం నటుడిగానే కాకుండా, విద్య, సాహిత్యం, ప్రజా సేవలోనూ విశేషమైన కృషి చేసిన గొప్ప వ్యక్తి అని ప్రధాని మోడీ కొనియాడా రు. ఆయన స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ సినీ నిర్మాణ కేంద్రంగా నిలవడమే కాకుండా, విద్యారంగానికి చేసిన సేవలలో భాగంగా గుడివాడలోని అక్కినేని నాగేశ్వరరావు కళాశాల వంటి అనేక విద్యా సంస్థలను అభివృద్ధి చేశారని పేర్కొన్నారు. ప్రధాని మోడీ మనకి బాత్ 117వ ఎపిసోడ్‌లో తపన్ సిన్హా, రాజ్ కపూర్‌లతో పాటు ఎఎన్‌ఆర్‌కు అర్పించిన నివాళిని మరోసారి గుర్తు చేశారు.
భారతీయ సినిమా గొప్పతనాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, ఈ ఏడాది భారత్‌లో వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్‌మెంట్ సమ్మిట్ ను నిర్వహించ నున్నట్లు ప్రకటించారు. తన తండ్రి ఎఎన్‌ఆర్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినందుకు హర్షం వ్యక్తం చేసిన నాగార్జున, ఆయన ప్రభావం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, పద్మవిభూషణ్ వంటి గౌరవాలు అందుకున్న ఎఎన్‌ఆర్ భారతీయ సినీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచే వ్యక్తి అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ సమావేశం, భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక మహనీయ నటుడి సేవలను గౌరవించే కీలక ఘట్టంగా నిలిచింది.