లక్నో : ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌కు ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన కల్యాణ్‌సింగ్ జీవిత విశేషాలను గుర్తు చేసుకొంటూ ప్రజా శ్రేయస్సే తన జీవిత మంత్రంగా చేసుకుని సామాన్య ప్రజల విశ్వాసానికి చిహ్నంగా నిలిచారని చెప్పారు. కల్యాణ్ సింగ్‌కు నివాళి అర్పించిన తరువాత ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. విలువలు కలిగిన గొప్ప వ్యక్తిని, సమర్థుడైన నేతను దేశం కోల్పోయిందని, ఈలోటును తీర్చడానికి ఆయన విలువలు, నిర్ణయాలు అమలు చేయడానికి గరిష్ఠ స్థాయిలో కృషి చేయాలన్నారు. ఆయన కలలను నిజం చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని ప్రధాని మోడీ చెప్పారు.
జన సంక్షేమం కోసమే తన జీవితమంతా అంకితం చేశారని, ఈ జీవిత మంత్రం తోనే ఆయన జనకల్యాణ్ అయ్యారని పేర్కొన్నారు. సిద్ధాంత పరంగా బిజెపికి, భారతీయ జనసంఘ్ కుటుంబానికి అలాగే దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం అంకితమయ్యారని ప్రశంసించారు. ఎమ్‌ఎల్‌ఎ అయినా, ప్రభుత్వంలో ఏ పదవినైనా, లేదా గవర్నర్‌గా అయినా తన బాధ్యతలు చక్కగా నిర్వర్తించి, ప్రతివ్యక్తికి స్ఫూర్తి కేంద్రంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయనకు తన వద్ద స్థానం కల్పించాలని, ఈ బాధను తట్టుకోగలిగిన శక్తిని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వాలని, భగవాన్ శ్రీరాముడిని ప్రార్థిస్తున్నానని మోడీ తెలిపారు. లక్నో లోని కల్యాణ్ షింగ్ నివాసానికి మోడీ చేరుకున్నాక, కల్యాణ్ షింగ్ పార్థివ దేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మోడీ వెంట బిజెపి చీఫ్ జెపి నడ్డా, యుపి గవర్నర్ ఆనంద్‌బెన్ పటేల్, యుపి సిఎం యోగి ఆదిత్యనాధ్, డిప్యూటీ సిఎంలు కేశవ్ ప్రసాద్, మౌర్య, దినేష్ శర్మ ఉన్నారు.