న్యూఢిల్లీ: ఒలింపిక్స్ అన్న మాట వినిపిస్తే చాలు, స్ప్రింటర్ మిల్కాసింగ్ గుర్తు రాకుండా ఉండరని ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసించారు. మన్‌కీబాత్ కార్యక్రమంలో భాగంగా ఆయన మిల్కాసింగ్ ప్రతిభను కొనియాడారు. మిల్కాసింగ్ అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం తనకు కలిగిందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఒలింపిక్స్‌కు వెళ్తున్న అథ్లెట్లను మోటివేట్ చేయాలని తాను ఆయనను కోరినట్టు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్తున్న ప్రతి క్రీడాకారుడి జీవితంలో తాను ఏళ్ల కొద్దీ అనుభవించిన సంఘర్షణ, శ్రమ దాగి ఉంటాయని పేర్కొన్నారు. ఆటగాళ్లు కేవలం వాళ్ల కోసమే ఒలింపిక్స్‌కు వెళ్లడం లేదని, అంతర్జాతీయ వేదికపై దేశం పేరు నిలబెట్టడానికి వెళ్తున్నారని మోడీ కొనియాడారు.
ఒలింపిక్స్‌కు ఎంతోమంది ఆటగాళ్లు వెళ్తున్నారని, కానీ వాళ్లలో కొద్దిమంది పేర్లు మాత్రమే తాను ప్రస్తావించగలనని చెప్పారు. మహారాష్ట్ర లోని సతారా జిల్లాకు చెందిన ప్రవీణ్ జాదవ్ అద్భుతమైన ఆర్చర్ అని, ఆయన తల్లిదండ్రులు ఇద్దరూ కూలీలైనా కష్టపడి టోక్యో ఒలింపిక్స్ అర్హత సాధించారని ప్రధాని కొనియాడారు. భారత హాకీ టీమ్ సభ్యురాలు నేహాగోయల్ తల్లి, అక్క సైకిళ్ల తయారీ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారని పేర్కొన్నారు. అంతటి పేద కుటుంబం నుంచి నేహా గోయల్ ఒలింపిక్స్‌కు ఎంపిక కాగలిగారు. మహిళా ఆర్చర్ దీపిక కూడా జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొని ఒలింపిక్స్‌లో అవకాశం పొందగలిగింది.
PM Modi pays tribute to legendary Milkha Singh