పింగళి వెంకయ్యకు ప్రధాని మోడీ నివాళి
మోడీ సహా బిజెపి నేతల డిపిలుగా త్రివర్ణ పతాకం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ తన సోషల్ మీడియా ఖాతాలపై డిస్‌ప్లే పిక్చర్ల(డిపి)ను జాతీయ పతాకంతో మార్చారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాక వేడుకలను సమష్టిగా జరుపుకోవడానికి ప్రజలందరూ తమ సోషల్ మీడియా ఖాతాలపై డిపిలను జాతీయ జెండాతో మార్చుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. కాగా.. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో సహా ఇతర సీనియర్ బిజెపి నాయకులు కూడా ప్రధాని పిలుపునకు స్పందించి తమ డిపిలను మార్చారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్‌తోపాటు పలువురు బిజెపి నాయకులు తమ ట్విట్టర్‌పై ప్రొఫైల్ పిక్చర్లను జాతీయ పతాకంతో మార్చారు. ఆగస్టు 2వ తేదీ ఎంతో ప్రత్యేకమైనదని, మన త్రివర్ణ పతాక వేడుకలను జరుపుకునేందుకు ఒక సమష్టి ఉద్యమం ప్రారంభమైందని, హర్ ఘర్ తిరంగ నిర్వహించేందుకు యావద్దేశం సంసిద్ధమైందని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. త్రివర్ణ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్యకు ఆయన జయంతి సందర్భంగా ప్రధాని నివాళి అర్పించారు. మనకు త్రివర్ణ పతాకాన్ని అందచేయడానికి ఆయన(పింగళి వెంకయ్య) సల్పిన కృషికి దేశం ఎన్నటికీ రుణపడి ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.
PM Modi Pays Tribute to Pingali Venkayya